పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ బృందం వారికి పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికింది. అనంతరం లంకా దినకర్, ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ కలిసి ప్రాజెక్టులోని స్పిల్ వే, కాపర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, టన్నెల్స్ తదితర పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, మ్యాపులను తిలకించి, ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈ రమేష్ కుమార్, ఎస్‌ఈ కె.రామచంద్రరావు, ఈఈలు, డీఈ పాల్గొన్నారు.


