చెరగని వైఎస్‌ సంతకం | - | Sakshi
Sakshi News home page

చెరగని వైఎస్‌ సంతకం

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

చెరగని వైఎస్‌ సంతకం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్థానంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్ర సుస్పష్టం. జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని సైతం సిరులు పండించే బంగారు భూమిగా మార్చి, బీడు వారిన పొలాల్లో పచ్చని పంటలు పండేలా చేసిన ఘనత ఆయనదే. జిల్లా శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ఐటీ ఏర్పాటు, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో జిల్లా దశను, దిశను మార్చి అభివృద్ధి పథంలో దూసుకువెళ్లేలా చేశారు. నేడు దివంగత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఆయన చేసిన మేలును స్మరించుకుంటూ..

సాక్షి ప్రతినిధి, ఏలూరు : దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది.. లక్షలాది ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీకి ఏలూరులోనే అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీల్లో నివసించే గిరిపుత్రులకు పోడు భూములిచ్చి సాగు దిశగా వారిని మళ్లించి వేలాది కుటుంబాల్లో వెలుగురేఖలు నింపింది కూడా ఉమ్మడి పశ్చిమ నుంచే. ఇలా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి గాంచిన పథకాలు జిల్లాలోనే ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన పెండింగ్‌ ప్రాజెక్టులను 2004లో ప్రారంభించి 2009 వరకు పనులు వేగంగా జరిగేలా చేశారు. ఏలూరులో తమ్మిలేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపారు. 2005 తమ్మిలేరు వరదలతో ఏలూరు అతలాకుతలం అయిన క్రమంలో రూ.17 కోట్ల వ్యయంతో తమ్మిలేరు రిటైనింగ్‌వాల్‌ మంజూరు చేశారు. మళ్లీ 2019 తరువాత పనుల నిర్మాణ వ్యయం పెరిగి రూ.90 కోట్లతో ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ హయాంలో పనులు పూర్తయ్యాయి.

రాష్ట్ర జీవనాడిగా పోలవరం

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు దివంగత వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. 2004లో పోలవరం ప్రాజెక్టును రూ.10,151 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసి కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, పునరావాసం పనులు ఇలా విభజించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్సార్‌ హయాంలోనే 60 శాతం కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆయన మరణంతో ప్రాజెక్టు పనులు మందగించాయి. తరువాత వైఎస్‌ జగన్‌ హయాంలో 2019 నుంచి 2024 వరకు వేగంగా సాగాయి. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కూడా మహానేతే శ్రీకారం చుట్టారు. 2008 అక్టోబర్‌ 30న కామవరపుకోటలో శంకుస్ధాపన చేసి రూ.1701 కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మెట్ట ప్రాంత మండలాల్లో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా దీన్ని రూపొందించారు. తదనంతర ప్రభుత్వాలు ప్రాజెక్టు స్వరూపాన్ని, పరిధిని పెంచుకుంటూ వెళ్లాయి. రెండు జిల్లాలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా రూ.3,200 కోట్లతో 53.50 టీఎంసీల గోదావరి జలాలు వాడుకునేలా మార్పులు చేశారు. అయితే నేటికీ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్ధితి.

4,500 ఎకరాల పోడు భూముల పంపిణీ

దశాబ్దాలుగా పోడు భూములపై ఆశలు పెంచుకున్న గిరిజనుల స్వప్నాన్ని దివంగత వైఎస్సార్‌ సాకారం చేశారు. ఉమ్మడి పశ్చిమ ఏజెన్సీలో 4,500 ఎకరాల పోడు భూములను 2,200 మంది గిరిజనులకు పంపిణీ చేసి సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించారు. ప్రస్తుతం పోడు భూముల్లో నాణ్యమైన పంట సాగు జరుగుతుంది. ప్రధానంగా వరి, పొగాకు, మొక్కజొన్నతో పాటు ఇతర పంటల సాగుతో గిరిజనులకు మేలు జరిగింది. అలాగే రూ.26 కోట్లతో పోగొండ రిజర్వాయర్‌ నిర్మించి బుట్టాయగూడెం, కొయ్యలగూడెంలో 7,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చింది దివంగత వైఎస్సారే. ఇక కొండ కాల్వ వద్ద జరిగే ప్రమాదాల శాశ్వత నివారణకు రూ.26 కోట్లతో వ్యయంతో హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మించారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసింది కూడా దివంగత వైఎస్సారే.

పోలవరం ప్రాజెక్టు

పశ్చిమ అభివృద్ధిపై దివంగత వైఎస్సార్‌ ముద్ర

పోలవరానికి బీజం వేసింది మహానేతే

చింతలపూడి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది రాజన్నే

పేద విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీ వరదాయిని

పోడు భూముల పంపిణీతో గిరిజనులకు మేలు

ఏలూరుకు రిటైనింగ్‌ వాల్‌.. వైఎస్సార్‌ చలవే

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement