న్యూస్‌రీల్
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026
భీమవరం: ఆక్వా హబ్‌గా పేరొందిన జిల్లాలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆక్వా రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జగన్ పర్యటనతో ప్రభుత్వంలో కదలిక వస్తే తమ కష్టాలు కొంతైనా తీరతాయని గంపెడాశతో ఉన్నారు. ప్రభుత్వానికి డాలర్ల పంట పండిస్తున్న ఆక్వా సాగులో రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నా వాటి పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో రైతులు సాగులో నష్టాలను భరించలేక క్రాప్ హాలీడే తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చారు.
జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాంతో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ యూనిట్ రూ.1.50 అందించడంతోపాటు ఫీడ్, సీడ్ ధరలపై నియంత్రణ విధించారు. కోవిడ్ సమయంలో ఎగుమతులు లేవంటూ రొయ్యల ఎగుమతులదారులు ధరలు ఘననీయంగా తగ్గించగా.. ఎక్స్‌పోర్టు కంపెనీల వద్ద రెవెన్యూ అధికారులను పెట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయించారు. ప్రస్తుత పరిస్థితిని రైతులు గుర్తు చేసుకుని కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి చేస్తున్న ద్రోహంపై మండిపడుతున్నారు.
ముంచిన మేత ధరలు
రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు పెరిగాయంటూ ఇటీవల ఫీడ్ ధరలు విపరీతంగా పెంచారు. ఇదే తరుణంలో రొయ్యల ధరలు పతనం కావడంతో రైతులు రోడెక్కి ఆందోళనలు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఫీడ్ బస్తాలను రోడ్డుపై వేసి తగులబెట్టారు. రొయ్యలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. పంట విరామంటూ చెరువుల వద్ద ఫ్లెక్సీలు పెట్టి మరీ నిరసన తెలిపారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా ఉంటుందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో కంగారు పడ్డ ప్రభుత్వం తక్షణం ఫీడ్ ధరను కిలోకు రూ.4 తగ్గిస్తామని, సబ్సిడీ విద్యుత్‌ను ఆక్వా రైతులందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఫీడ్ కంపెనీలు కేవలం రూ.2 లు మాత్రమే తగ్గించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్సిడీ విద్యుత్ ఫలాలు నేటికీ రైతులకు అందకపోవడంతో ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తెగుళ్లతో కుదేలు
జూన్ నెల ప్రారంభం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, ఉక్కబోత ఎక్కువగా ఉండడం వెంటనే ఈదురుగాలులు, వర్షంతో చల్లగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాపిస్తున్నాయి. వైట్‌గట్ తెగుళ్లుతో నష్టపోతున్నారు. తెగుళ్ల కారణంగా మందులకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి రావడంతోపాటు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు మీసం మెలేసిస రొయ్యల రైతు నేడు దిగాలుగా చెరువు వైపు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు తవ్వకానికి, విద్యుత్, ఇంజిన్లు, ఏరియేటర్స్ వంటివాటికి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ప్రతికూల వాతావరణం, ప్రభుత్వ సహాయం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వంలో చలనం వచ్చి రైతులకు మేలుచేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు.
వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న ఆక్వా రైతులు
జగన్ భీమవరం పర్యటనపై ఆశలన్నీ
తగ్గని ఫీడ్, సీడ్ ధరలతో రైతులు సతమతం
అమలు కాని సబ్సిడీ విద్యుత్


