కదం తొక్కిన అంగన్‌వాడీలు | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన అంగన్‌వాడీలు

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

ఏలూరు (టూటౌన్‌): అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ అనుబంధ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరులో కదం తొక్కారు. కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. పోలీసులకు, యూనియన్‌ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించారు. ముందుగా జ్యూట్‌మిల్‌ సెంటర్‌ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ప్రదర్శనగా కలెక్టర్‌ కార్యాలయం వరకు వెళ్లారు. అంగన్‌వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, పెన్షన్‌, పీఎఫ్‌ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. అంగన్‌వాడీల ఆందోళనకు యూనియన్‌ జిల్లా కార్యదర్శి టి.మాణిక్యం అధ్యక్షత వహించారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని విమర్శించారు. మార్చిలో వారం రోజుల్లో వేతనాలు పెంచేలా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రకటన అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రం ఐసీడీఎస్‌ను ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయినా నేటికీ అంగన్‌వాడీలను కార్మికులుగా గుర్తించలేదన్నారు. అనంతరం జిల్లా అధికారులను, కలెక్టర్‌ను కలిసేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. దీనితో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు సిబ్బందితో అడ్డుకున్నారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు జిల్లా రెవెన్యూ అధికారి మైథిలి, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి నాంచారయ్య, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శారద చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement