ఆక్వా అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

ఆక్వా అతలాకుతలం

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

సమావేశానికి హాజరైన ఆక్వా రైతులు, పార్టీ శ్రేణులు, బువ్వనపల్లిలో ఆక్వా రైతుల సమావేశంలో మాట్లాడుతున్న పేర్ని నాని

గణపవరం: రాష్ట్రంలో ప్రగతి పథంలో నడుస్తున్న ఆక్వారంగం, కూటమి పాలనలో అధోగతిపాలైందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు పేర్ని నాని అన్నారు. శుక్రవారం రాత్రి బువ్వనపల్లిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షత వహించారు.

ఆక్వా రైతులపై భారం

పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో ఏ ఆక్వా రైతు మొహంలో చిరునవ్వు లేదని, రైతులు నేడు తిరగబడే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మేతల ధర కిలోకు రూ.2 పెంచితేనే అప్పట్లో జగన్‌కు లంచాలు వెళ్తున్నాయని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు, ఇప్పుడు కిలోకు రూ.10 పెంచి, తొడగొట్టి చెబుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మేతల కంపెనీలను కిలోకు రూ.4 తగ్గించమని ఆదేశిస్తే, వారు కేవలం రూ.2 మాత్రమే తగ్గించి తమ సత్తా ఏంటో చూపెట్టారని విమర్శించారు. కంపెనీలతో పాలక పెద్దలు కుమ్మక్కు కాకుండా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టడం సాధ్యం కాదన్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే సగం చార్జింగ్‌ దిగిపోయిందని, మిగిలిన చార్జింగ్‌ను రైతులు దింపుతారని హెచ్చరించారు.

భీమవరం వస్తున్న జగన్‌

జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న భీమవరం వస్తున్నారని, ఆయన పర్యటనను రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వారంగాన్ని కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతులను ముంచేస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో గణపవరం మండలంలోనే ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్‌ పథకాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అర్ధవరం రాము, ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రామయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశీ, కొరిపల్లి జయలక్ష్మి, తుమ్మగుంట రంగాభవాని, మండల పార్టీ అధ్యక్షులు దండు రాము, సంకు సత్యకుమార్‌, మరడ మంగారావు, రావిపాటి శ్రీనివాస్‌, పార్టీ సీనియర్‌ నాయకులు ముళ్లగిరి జాన్సన్‌, వెజ్జు వెంకటేశ్వరరావు, నడింపల్లి సోమరాజు, శెట్టి రాజా, నియోజకవర్గ పరిశీలకుడు ఏఎస్‌ రాజు, కాన్వెంట్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement