రైతు కంట కన్నీరు | - | Sakshi
Sakshi News home page

రైతు కంట కన్నీరు

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

జంగారెడ్డిగూడెం: రైతు కంట కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వానికి మనుగడ ఉండదని ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ, రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ధర్నా, సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, కార్లు, బైకులతో ర్యాలీగా తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం మార్కెట్‌ యార్డ్‌ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పంచాయతీ కార్యాలయం, గంగానమ్మ గుడి సెంటర్‌, బోసు బొమ్మ సెంటర్‌, అశ్వరావుపేట రోడ్డు మీదుగా టొబాకో బోర్డు కార్యాలయం వరకు సాగింది. వర్జీనియా పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ సురేంద్రకు నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో డీఎన్నార్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరని, దీనికి కారణం చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలేనని విమర్శించారు. వర్జీనియా పొగాకు రైతుకు కనీస మద్దతు ధర కేజీ రూ. 300 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ మాట్లాడుతూ గత ఏడాది వర్జీనియా పొగాకుకు గరిష్టంగా రూ.450 పైగా రాగా, ఈ ఏడాది గరిష్టంగా రూ.260 మాత్రమే వస్తోందని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌ రైతు బాంధవుడిగా ఉచిత విద్యుత్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వరి పండించవద్దని అనడం దౌర్భాగ్యమని విమర్శించారు.

నష్టాల ఊబిలో రైతులు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ప్రస్తుతం వర్జీనియా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్‌ హయాంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా నిధులు ఏర్పాటు చేసి పొగాకును కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం పండించిన పంట కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. వర్జీనియా పొగాకు వల్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని, లక్షలాది మంది కూలీలు దీనిపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ కంభం విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు తనను విజనరీ సీఎంగా చెప్పుకుంటారని, అసలు విజన్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారని, రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.

వైఎస్‌స్సార్‌ హయాంలో

రూ.200 కోట్ల సాయం

పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ తెల్లం బాలరాజు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో పొగాకు రైతులను రూ.200 కోట్లు ఇచ్చి కొనుగోలుచేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి ఆదుకున్నారన్నారు. చంద్రబాబు మాత్రం వ్యవసాయం దండగని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం ముఖ్యం కాదని, కేవలం రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. మామిడి, మిర్చి, వరి రైతులంతా తీవ్ర నష్టాల్లో ఉన్నారని, విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రశించే వారిపై కేసులు పెట్టడం, మామిడి రైతులపై లాఠీఛార్జి చేయడం అమానుషమని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్ముల సురేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పొగాకు కొనుగోలుకు రూ. 1000 కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు రైతులను చిన్న చూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు అండగా నిలబడి పోరాటం చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, ఏలూరు కన్వీనర్‌ మామిళ్లపల్లి జయప్రకాష్‌, బీవీఆర్‌ చౌదరి, రైతు సంఘాల నాయకులు సత్రం వెంకటరావు, వామిశెట్టి హరిబాబు, ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్త, కుక్కల ధర్మరాజు, జెట్టి సత్య ఆదిత్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ విభాగాల నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు, రైతులు పెద్దెత్తున పాల్గొన్నారు.

ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదు

వర్జీనియా పొగాకు రైతుల భారీ నిరసన ర్యాలీలో వక్తలు

గిట్టుబాటు ధర కల్పించాలంటూ జంగారెడ్డిగూడెంలో భారీ బహిరంగ సభ

కేజీకి కనీస మద్దతు ధర రూ.300 ఇవ్వాలని డిమాండ్‌

వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, రైతుల సంఘాల నేతల హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement