కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) –2026లో భాగంగా ఇంతవరకు 12 లక్షల 40 వేల 130 (75.42 శాతం) ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో 16 లక్షల 44 వేల 194 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో ఇప్పటివరకు 16 లక్షల 41 వేల 778 (99.85 శాతం) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 1744 మంది బీఎల్ ఓలు సర్ కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రజలు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిచేసి, బీఎల్‌ఓలకు అందించి నిర్దేశించిన సమయంలోగా సర్ కార్యక్రమం పూర్తయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
పోలవరం రూరల్: గోదావరి నదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నీరు నదిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 26.690 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. నీటిమట్టం పెరుగుతుండడంతో స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే తాత్కాలిక రోడ్డు మార్గం కోతకు గురై రోడ్డు దిగువన వేసిన తూరలు కూడా కొట్టుకుపోయాయి.
ఉంగుటూరు: చేబ్రోలు వద్ద రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతిచెందిన షేక్ చాంద్ బాషా, అతని భార్య హసీనా, పెద్ద కుమార్తె ఫరీన్, చిన్న కుమార్తె సమీరాల మృతదేహాలకు మంగళవారం గుడివాడలో హసీనా తమ్ముడు అబ్దుల్లా అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కావడంతో, రైల్వే పోలీసులు మృతదేహాలను బాషా బావమరిదికి అప్పగించారు. తాడేపల్లిగూడెంలో బాషా బంధువులు ఎవరూ లేకపోవడంతో అబ్దుల్లా మృతదేహాలను గుడివాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. వారి మరణానికి గల ప్రధాన కారణాలను కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కుటుంబంలోని నలుగురూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికి తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ చావే పరిష్కారం అనుకుని వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు చెప్పారు.
ఏలూరు టౌన్: పోలీస్ శాఖలో 2004 సంవత్సరానికి ముందు విధుల్లో చేరిన పోలీస్ ఉద్యోగులను సీపీఎస్ నుంచి జీపీఎస్ పెన్షన్ విధానంలోకి మార్పు చేసే నిర్ణయంపై ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌ను పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ సిబ్బంది మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శివకిషోర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, సంఘం ప్రతినిధులు ఉన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏపీ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఈమని గ్రీష్మ కుమార్, ప్రధాన కార్యదర్శి మానికల నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రమాద మరణం, అంగవైకల్య పరిహారం, వైద్య ఖర్చులు, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్‌లు వంటి వాటిని పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దా సోమయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు 60 ఏళ్లు పైబడినా వృత్తిలో కొనసాగుతున్న నేపథ్యంలో కార్మికులు మరణించేవరకూ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీసీఎల్ శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేశారు.


