దళిత రైతులకు దక్కని అసైన్డ్‌ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

దళిత రైతులకు దక్కని అసైన్డ్‌ ఫలాలు

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

సమాచారం లేదనడం అనుమానాస్పదం

చింతలపూడి: నిరుపేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం క్షేత్రస్థాయిలో అక్రమార్కుల పాలువుతోంది. గత ప్రభుత్వం ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో నిరుపేద ఎస్సీ రైతులకు సాగు నిమిత్తం అసైన్డ్‌ భూములను కేటాయించింది. ఆ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించి, దళిత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలనే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం ఉచితంగా సామూహిక వ్యవసాయ బావులను (కమ్యూనిటీ బోర్వెల్స్‌) తవ్వించింది. అంతేకాకుండా లక్షలాది రూపాయల ప్రజాధనంతో వీటికి మోటార్లు, విద్యుత్‌ సౌకర్యం కూడా కల్పించింది.

చేతులు మారిన భూములు..

అక్రమార్కుల చేతుల్లో బోర్లు

ప్రభుత్వం ఆశించిన ఆశయం బాగున్నా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. నిరుపేదలకు చెందిన ఆ అసైన్డ్‌ భూములు, లక్షల రూపాయల ఖర్చుతో వేయించిన బోర్ల ఫలాలు నేడు అర్హులైన ఎస్సీ రైతుల చేతుల్లో లేవు. దళితుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కొందరు బడా రైతులు, స్థానిక రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు ఆ భూములను, బోర్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

సొంత భూముల్లోనే కూలీలుగా..

గత కొద్ది సంవత్సరాలుగా సాగు పెట్టుబడులు పెరిగిపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో దళిత రైతులు తమ భూములను ధనిక రైతులకు అప్పగించాల్సి వచ్చింది. చాలా చోట్ల ఎస్సీ కార్పొరేషన్‌ నిర్మించిన బోర్లు, మోటార్లతో సహా భూములను అనధికారికంగా బడా రైతులు కొనుగోలు చేశారు. రికార్డుల్లో దళిత రైతుల పేర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పంటలు పండించి లాభాలు గడిస్తున్నది మాత్రం ఇతర ధనిక వర్గాలే కావడం గమనార్హం. నాడు ప్రభుత్వం ఎవరినైతే భూయజమానులుగా చూడాలనుకుందో, ఆ దళిత రైతులే నేడు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మారిన దుస్థితి నెలకొంది.

సమగ్ర విచారణ అత్యవసరం

ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు స్పందించి ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని ఏయే మండలాల్లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా బోర్లు వేశారు? ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలి. అక్రమంగా భూములు, బోర్లను అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, తిరిగి ఆ వసతులను నిరుపేద దళిత రైతులకు దక్కేలా చూడాలి. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆశయం నీరుగారిపోతుంది.

మా సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులను వివరాలు కోరగా.. ఆ సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని సమాధానం ఇచ్చారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసిన ఒక పెద్ద పథకానికి సంబంధించిన వివరాలు లేవని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి.

– తుల్లిమెల్లి కుటుంబరావు, ఎన్‌జీఓ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement