ఏలూరు (టూటౌన్): గత కొన్నేళ్ళుగా ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు ఆర్‌ఓఎస్‌ఆర్ పట్టాలివ్వాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో జిల్లాలోని ఏలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు చెందిన 30 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్‌కె గౌస్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు వేలాది ఎకరాల అటవీ భూములు అప్పనంగా అప్పగిస్తున్న ప్రభుత్వాలు పేదల సాగులోని భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదన్నారు. ఆదివాసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఆదివాసీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలివ్వాలని కోరారు.


