● ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందలేదని తల్లిదండ్రుల ఆవేదన
● మోతుగూడెంలో విషాదచాయలు
బుట్టాయగూడెం: వాంతులు, జ్వరం, విరేచనాలతో బాధపడుతూ వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఒక నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డకు వైద్యం చేయించి, క్షేమంగా ఇంటికి తీసుకువెళ్దామనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. బిడ్డ మృతదేహాన్ని చూసి వారు తల్లడిల్లిపోతున్నారు. ఈ విచారకర సంఘటనకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు గురుగుంట్ల వెంకటరెడ్డి, సునీత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమ మూడో సంతానమైన రిత్విక శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతో ఆరోగ్యంగా, ఆటపాటలతో గడిపిందని వారు తెలిపారు. శనివారం సాయంత్రం జ్వరం రావడంతో పాటు వాంతులు, విరేచనాలు అవుతుండడంతో బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో (సీహెచ్‌సీ) చేర్పించినట్లు చెప్పారు. వైద్యం కోసం వచ్చిన తమ బిడ్డను ఆస్పత్రిలో చేర్పించేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని, స్థానిక వ్యక్తి ఒకరితో మాట్లాడించిన తర్వాతే చేర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
తమ కూతురు రిత్వికను ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా కేవలం ఒక సిరప్, పారాసెట్మాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని తల్లి సునీత ఆరోపించారు. ఆదివారం రాత్రి సమయానికి బిడ్డ విపరీతంగా ఏడుస్తూ బాధపడుతున్నా, ఆ సమయంలో ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. బిడ్డ బాధ చూడలేక అక్కడ ఉన్న సిబ్బందిని నిద్ర లేపగా.. వారు డాక్టర్‌కు ఫోన్ చేశారని, ఆ తర్వాత వచ్చిన డాక్టర్ పరిశీలించి పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారన్నారు. వెంటనే అంబులెన్స్ సిద్ధం చేసి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి రిఫర్ చేశారని తెలిపారు. అయితే, జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే తమ కూతురు మృతి చెందిందని, మార్గమధ్యంలోనే చనిపోయి ఉండవచ్చని అక్కడి వైద్యులు తెలిపారన్నారు. సకాలంలో వైద్యం అంది ఉంటే తమ బిడ్డ బతికేదని సునీత తీవ్రంగా రోదించారు. బాలిక తండ్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గురువారం నుంచి తాను కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నానని, శనివారం సాయంత్రమే తాను ఇదే బుట్టాయగూడెం సీహెచ్‌సీ నుంచి డిశ్చార్జ్ అయ్యానని చెప్పారు. నీరసంగా ఉండటం వల్ల తాను తిరిగి ఆస్పత్రికి రాలేకపోయానని, కడసారి కూతుర్ని కూడా చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని వెంకటరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి రిత్విక మృతితో మోతుగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ కోర్సా గంగరాజు డిమాండ్ చేశారు.
బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
సరైన వైద్యం అందక మృతి చెందిన రిత్విక కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కారం రాఘవ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బాలిక మృతిపై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వసుంధరను, వైద్యులను, సిబ్బందిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బన్నే వినోద్, బాషా శ్యాంబాబు, కెచ్చెల మంగిరెడ్డి, ప్రతాప్ పాల్గొన్నారు.


