
ఏఐ సాయంతో ఫిర్యాదుల స్వీకరణ
ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లా పోలీస్ శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రజా ఫిర్యాదుల వేదికను కాగిత రహితంగా చేపట్టేందుకు కొత్త విధానానికి నాంది పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో బాధితులు తమ సమస్యలు చెప్పుకుంటే... నిర్ధేశిత ఫార్మాట్ ఆధారంగా బాధితుల నుంచి ఏఐ మరిన్ని వివరాలు రాబట్టి ఫిర్యాదు తయారుచేస్తుంది. ఈ ఆధునిక విధానాన్ని జిల్లా పోలీస్ శాఖ పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అమలు చేస్తోంది. ఎలాంటి తప్పులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా దీనిని రూపొందిస్తారు. పారదర్శకంగా, కాగిత రహితంగా పూర్తి డిజిటల్ విధానంలో ఉండటం దీని ప్రత్యేకత. మరోవైపు ఫిర్యాదుదారులు చెప్పిన వివరాలన్నీ వీడియో రికార్డింగ్ చేయటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటలైజేషన్ కావడంతో అటు పోలీస్..ఇటు ప్రజలకు సులభతరం, పారదర్శకంగా ఉంటుందని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా వ్యాప్తంగా 39 ఫిర్యాదులు పోలీసు అధికారులకు అందాయి.
జిల్లా ఎస్పీ శివకిషోర్ వినూత్న ప్రయోగం