
‘సంస్కృతి అనే పదం విన్నప్పుడల్లా నా చేయి తుపాకీ కోసం వెదుకుతుంది’ అని జర్మన్ నాటక రచయిత, కవి హొన్స్ జాట్ విరచిత నాటకంలోని పాత్ర అంటుంది. హొన్స్ తొమ్మిది దశాబ్దాల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి అధినేతను ఊహించారా అనిపించేలా ఆయన వరస నిర్ణయాలుంటున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌తో యునెస్కో నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన తాజా ప్రకటన ఆ కోవలోనిదే. రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతిని సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ఐక్యరాజ్యసమితి ఛత్రఛాయలో ఏర్పడిన అనేకానేక సంస్థల్లో యునెస్కో ఒకటి.
విద్య, శాస్త్ర విజ్ఞానం, సంస్కృతి అంశాల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం కోసం ఆ సంస్థ ఆవిర్భవించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి, ప్యారిస్ ఒడంబడిక వగైరాల నుంచి ఇప్పటికే అమెరికా తప్పుకుంది. ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక దేశంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ కీర్తిప్రతిష్ఠలు కలిగిన అగ్రశ్రేణి విద్యాసంస్థకే దిక్కు లేదు గనుక యునెస్కో నుంచి అది తప్పుకోవటం ఆశ్చర్యం కలిగించదు. ట్రంప్ గత ఏలుబడిలో కూడా 2017లో యునెస్కో నుంచి ఆ దేశం నిష్క్రమించింది. అసలు యునెస్కో పుట్టినప్పటి నుంచీ దానితో అమెరికాకు పేచీయే. అక్కడ ఎవరున్నారన్నదాంతో నిమిత్తం లేదు.
ప్రపంచంలో గిట్టని ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూలదోస్తూ, దారికి రాని దేశాలపై సొంతంగా ఆంక్షలు విధిస్తూ తననే అందరూ అనుసరించాలంటూ ఒత్తిళ్లు తెచ్చే దేశానికి సంస్కృతితో ఏం పని? నిరాయుధ పాలస్తీనియన్ల ఊచకోతకు పాల్పడుతూ, ఆకలితో మాడ్చి చంపుతూ వీరంగం వేస్తున్న ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనకుండా... భారత్–పాక్‌లను బెదిరించి యుద్ధం ఆపానని గప్పాలు పోయే ప్రభుత్వానికి విద్యాసంస్థల విలువ, శాస్త్ర విజ్ఞానం అవసరం తెలిసేదెలా?
రోనాల్డ్ రీగన్ ఏలుబడిలో 1983లో తొలిసారి యునెస్కో నుంచి ఆ దేశం తప్పుకుంది. ప్రతి అంశాన్నీ యునెస్కో రాజకీయమయం చేస్తున్నదని, పాశ్చాత్య ప్రపంచానికి అది బద్ధ వ్యతిరేకి అని ఆరోపించింది. అటుపై జార్జి డబ్ల్యూ బుష్ వచ్చాక సంస్థ సంస్కరణలు సంతృప్తి కలిగించాయంటూ 2003లో తిరిగి చేరింది. రీగన్, జార్జి బుష్‌లిద్దరూ రిపబ్లికన్లు. డెమాక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడైన బరాక్ ఒబామాకు సైతం యునెస్కో కంటగింపే అయింది.
ఐక్యరాజ్యసమితి సభ్య దేశంగా అమెరికా ఇంకా లాంఛనంగా గుర్తించని పాలస్తీనాను యునెస్కోలో చేర్చుకోవటంపై ఆయన గారు ఆగ్రహించి ఆ సంస్థకు చెల్లించాల్సిన విరాళాన్ని నిలిపేశారు. 2023లో బైడెన్ హయాంలో తిరిగిఅందులో చేరినా 60 లక్షల డాలర్ల పైగా బకాయిల్ని చెల్లించనే లేదు. చిత్రమేమంటే బకాయి భారాన్నీ, ఇజ్రాయెల్‌ను దోషిగా చూపుతున్నారని కారణాన్నీ చూపించి ట్రంప్ తన తొలి ఏలు బడిలో దాన్నుంచి తప్పుకున్నారు.
ట్రంప్‌కు ముందున్న అధ్యక్షులు నేరుగా చెప్పటానికి మొహ మాటపడ్డారు గానీ...ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాటన్నా, దాని ప్రయోజనాలకు కించిత్తు విఘాతం కలిగినా అమెరికా సహించలేదు. అలాచేస్తే యూదు వ్యతిరేకతగా పరిగణిస్తుంది. హిట్లర్‌హయాంలో యూదుల్ని ఊచకోత కోసిన వైనంపై బహువిధ మాధ్యమాల ద్వారా చైతన్యం కలిగిస్తున్న యునెస్కోపై యూదు వ్యతిరేక ముద్రేయటం అమెరికాకే చెల్లింది.
పురావస్తు సంపద సమస్త మానవాళికీ చెందుతుందని, ఆ వారసత్వ సంపదను అపురూపంగా భావించి పరిరక్షించటం మనందరి కర్తవ్యమని 1945లో ఆవిర్భవించినప్పుడే యునెస్కో ప్రకటించింది. 200 దేశాలకు సభ్యత్వం, మరో 12 దేశాలకు సహ సభ్యత్వమిచ్చి 170 దేశాల్లోవున్న 1,248 చరిత్రాత్మక స్థలాలను సంరక్షించటానికి అది కృషి చేస్తోంది. ఇరాక్‌లోని యూప్రటీస్ నదీతీరంలో నిర్మితమైన నాలుగువేల ఏళ్లనాటి బాబిలాన్ నగరం, ఈజిప్టులోని క్రీ.పూ. 13 శతాబ్దంలో నిర్మించిన అబూసింబెల్ సూర్య దేవాలయం, బిహార్‌లోని క్రీ.పూ.
మూడో శతాబ్దంనాటి నలందా విశ్వవిద్యా లయ ఆనవాళ్లు, ప్రస్తుత మెక్సికో, గ్వాటెమాలా, ఎల్‌సాల్వెడార్ ప్రాంతాల్లో వ్యాపించిన క్రీ.పూ. 2000నాటి మయన్‌ల సంస్కృతి, తొమ్మిదో శతాబ్దంలో యశోధరపురంగా వెలిగిన ఆంకోర్‌వాట్ లోని అపురూప దేవాలయాలు, ఇంకా... మన తాజ్‌మహల్, తెలంగాణలోని రామప్ప దేవాలయం తదితరాలు అందులో ఉన్నాయి. వాటిలో అమెరికాకు సంబంధించిన చారిత్రక స్థలాలే 26.
ఈ వారసత్వ సంపద పరిరక్షణకు నిధులు వెచ్చించటం, ఆ పరిరక్షణకు తోడ్పడే ఉపకరణాల అభివృద్ధి, లోతైన పరిశోధన, వాటికి సంబంధించిన కచ్చితమైన శాస్త్రీయ ఆధారాల సేకరణ, ప్రమా ణాలు నిర్దేశించటం వగైరాలు యునెస్కో పనుల్లో అంతర్భాగం. ఇవే కాదు... జీవవైవిధ్య పరిరక్షణ, ప్రామాణిక విద్యనందించటం, అంతరిస్తున్న మాతృభాషలను బతికించటానికి అనువైన చర్యలు తీసుకోవటం, మన దేశంతో సహా ప్రపంచంలో అనేకచోట్ల అణగారిన వర్గాల్లో నైపుణ్యాభివృద్ధివంటివి, అందుకు కృత్రిమ మేధ సాయం తీసుకోవటం యునెస్కో చేపట్టిన పనుల్లో కొన్ని.
రేపు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలూ యునెస్కో నుంచి వైదొలగవచ్చు. విరాళాలు ఆగి సంస్థ నిర్వాహణ సంక్షోభంలో పడినా పడొచ్చు. సిబ్బందిని తగ్గించాల్సిరావొచ్చు. ప్రాచీన సంపద పరిరక్షణలో సమస్యలు తలెత్తవచ్చు. రేపటి తరాల భవిష్యత్తుకై కృషిచేస్తున్న సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం విచారకరం. ఈ లోటు పూడ్చేందుకు చైనా సాయం అందిస్తామంటోంది. కొందరు నేతల మూర్ఖత్వం కారణంగా యునెస్కో వంటి సంస్థలు కనుమరుగు కాకుండా కాపాడుకోవటం ప్రపంచ పౌరులందరూ బాధ్యతగా భావించినప్పుడే ఇలాంటి బెదిరింపుల బెడద విరగడవుతుంది.