Sakshi News home page

నా దేశం నగ్నదేహమా?

Published Sun, Jul 23 2023 2:56 AM

Sakshi Editorial On Naked parade of Manipur women

అర నిమిషం నిడివి కూడా లేని ఆ వీడియో అణు విస్ఫోటనాన్ని తలపించింది. కోటానుకోట్ల మనసుల్ని షాక్‌కు గురిచేసిన ఆ విద్యుదావేశాన్ని కొలవడానికి వోల్టేజీ లెక్కలు సరిపోకపోవచ్చు. క్రోధం, దుఃఖం, అవమానం, అసహ్యం, భయం వగైరాలన్నీ సునామీ కెరటాల్లా గుండెల లోతుల్లోంచి దూసుకొస్తున్నాయి. మణిపురలో జరిగిన బర్బర క్రీడను కోట్ల గొంతుకలు ఖండిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థలన్నీ ఈ అమానుషాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఒక్క బీబీసీని అయితే బెదిరించగలిగాం కానీ ఇంతమందిని బెదిరించడం సాధ్యం కాలేదు. కనుక ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది.

మూకదాడులు చెలరేగిన ప్రతిచోటా మహిళల దేహాలు శత్రువుల చేతుల్లో ఆయుధాలుగా మారుతూనే ఉన్నాయి. చిత్రవధల రచనకు క్యాన్వాస్‌లవుతూనే ఉన్నాయి. ఈ ధోరణి మణిపురలో మాత్రమే ప్రారంభం కాలేదు. మణిపురతో అంతమూ కాదు. మూకదాడుల్లో తమ ప్రాబల్య విస్తరణ పరమార్థమున్న రాజకీయ శక్తులున్నంతకాలం మణిపురలు మండుతూనే ఉంటాయి. మానవత్వం కాలు తూనే ఉంటుంది. మణిపుర అల్లర్లను కేవలం మైతేయ్‌ (ఓబీసీ), కుకీ (ఎస్‌టీ)ల ఘర్షణగానే చూడాలా? అంతకు మించిన వృత్తాంతమున్నదా?

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మణిపుర జనాభాలో 53 శాతం మంది మైతేయ్‌ తెగవారు. వీరు ప్రధానంగా సారవంతమైన ఇంఫాల్‌ లోయభూముల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీ జాతులవారు 40 శాతం వరకు ఉంటారు. మిగిలినవారు చిన్నచిన్న గిరిజన తెగలు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులు, ముస్లింలు. గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. మైతేయ్‌ల్లో అత్యధికులు హిందు వులు. మహాభారతంలోని బభ్రువాహనునికి వారసులమని వారి విశ్వాసం.

అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకొని రాజకుమారి చిత్రాంగద ప్రేమలో పడతాడు. వీరికో కుమారుడు. వాళ్లనక్కడే వదిలేసి అర్జునుడు తన మానాన తాను వెళ్లిపోతాడు. యుద్ధం ముగిసి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వాన్ని మణిపుర ప్రాంతం రాజకుమా రుడు బభ్రువాహనుడు బంధిస్తాడు. రక్షణగా వెళ్లిన అర్జు నుడిని కూడా ఓడించి గాయపరుస్తాడు. అదే ప్రాంతంలో ఉండే అర్జునుడి మరో భార్య ఉలూచి అనే నాగినికి విషయం తెలిసి నాగమణి ప్రభావంతో అర్జునుడిని కాపాడుతుంది.

కథ సుఖాంతమై ఇద్దరు భార్యలతో అర్జునుడు హస్తినకు చేరుకుంటాడు. ఈ కథ యథాతథంగా వ్యాసభారతంలో లేదట! రవీంద్రనాథ్‌ టాగోర్‌ రాసిన ఒక నాటకంలో ఈ ఉదంతం ఉన్నదట! తెలుగు, కన్నడ భాషల్లో ‘బభ్రువాహన’ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఇందులో ఆసక్తిక రమైన విషయమేమిటంటే చిత్రాంగదది మైతేయ్‌ (మణి పురి) తెగ. ఉలూచిది నాగా తెగ. ఇప్పుడీ రెండు తెగలవారు అక్కడ గణనీయంగా ఉన్నారు.

చిత్రాంగద గొప్ప యోధ. ఆమె తండ్రి చిత్రవాహనుడికి మగ సంతానం లేనందువలన ఆమెకు యుద్ధ విద్యల్లో తర్ఫీదునిస్తాడు. ఆమె శిక్షణలోనే రాటుదేలిన బభ్రువాహ నుడు తండ్రినే ఓడిస్తాడు. నిన్న మొన్నటి ఈరోమ్‌ షర్మిల వరకు మణిపురి మహిళల సాహస స్వభావం మనకు కనిపి స్తూనే ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ 16 సంవత్సరాల పాటు ఈరోమ్‌ షర్మిల నిరాహారదీక్ష చేశారు.

ఒక దశలో ఇంఫాల్‌ లోయ ప్రాంతాన్ని (ఎక్కువగా మైతేయ్‌లు నివసించే ప్రాంతం) చట్ట పరిధి నుంచి మినహాయించి ఈరోమ్‌ను దీక్ష విరమించాలని ప్రభుత్వం కోరింది. కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఇంకా చీకటి చట్టం మాటున మగ్గుతుండగా తాను ఎట్లా ఉద్యమాన్ని విరమిస్తానని ఈరోమ్‌ ప్రశ్నించింది. ఆమె మైతేయ్‌ తెగ మహిళ.

స్వభావ సిద్ధంగా ప్రజల మధ్య విభజన లేదు. చీకటి చట్టం మాటున మన సాయుధ జవాన్లు అన్ని తెగల మీద తమ దాష్టీకాన్ని ప్రయోగించారు. మహిళల మీద అత్యా చారాలు ఒక అలవాటుగా మార్చుకున్నారు. థాంజోమ్‌ మనోరమ అనే మహిళను పారా మిలటరీ జవాన్లు సామూహిక అత్యాచారం చేసి చంపేయడం అన్ని తెగల మహిళల్నీ కదిలించింది.

కొందరు మహిళలు నగ్నంగా వీధుల్లోకి వచ్చి ‘ఇండియన్‌ ఆర్మీ... రేప్‌ అజ్‌’ అనే బ్యాన ర్‌తో ప్రదర్శన చేసిన ఘటన, ఇరవయ్యేళ్లు గడిచినా ఇంకా వెన్నాడుతున్న పీడకలగానే మిగిలిపోయింది.

తెగల మధ్య సహజంగా ఉండే చిన్నచిన్న వైరుద్ధ్యాలు సెగలు గక్కే శత్రు వైరుద్ధ్యాలుగా పరిణమించవలసిన అవ సరం లేదు. ఆ అవసరం కొన్ని సంకుచిత శక్తులకున్నది.

మంటల్లో చలికాచుకునే రాజకీయ శక్తులకున్నది. సంఘాన్ని మెజారిటీ – మైనారిటీలుగా విడగొట్టి మెజారిటీ పక్షాన పేటెంట్‌ హక్కు రాసుకొనే స్వార్థ వర్గాలకున్నది. మైనారిటీల మీద మూకదాడులకు మెజారిటీలను ఉసిగొలిపే వ్యూహ కర్తలకున్నది. ఈ మూకదాడులు క్షణికావేశాలు కావనీ, ప్రణాళికాబద్ధమేనని బిల్కిస్‌ బానో ఉదంతం మనకు చాటి చెప్పింది.

గుజరాత్‌ అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులందరినీ అల్లరిమూక చంపేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ధైర్యంగా పట్టుదలతో హంతకుల మీద కేసు నడిపింది. వారికి శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తి కాకముందే స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆ హంతకులు రాచమర్యాదలతో విడుదలయ్యారు. వారికి స్వాతంత్య్ర సమరయోధుల కంటే మిన్నగా స్వాగత సత్కారాలు లభించాయి. ఈ ఘటన నేర్పుతున్న పాఠమేమిటి?

మణిపుర ఘటనలు ‘డబుల్‌ ఇంజన్‌’ సర్కార్‌ నిర్వాకమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అది తప్పు. అక్కడున్నది ‘ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కార్‌’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించే ఇంజన్‌లయితే కనిపించని ఆ మూడో ఇంజనే పరివార్‌... సంఘ్‌ పరివార్‌! ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో క్రైస్తవ ప్రాబల్యం పెరుగుతుండడంతో పరివార్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది.

వారి వ్యూహం ఫలించడం మొదలైంది. కాషాయ పార్టీ అక్కడ బలం పుంజుకున్నది. మణిపుర అల్లర్లు ఎలా మొదల య్యాయి? ఒక మైతేయ్‌ మహిళను కుకీ తెగవారు రేప్‌ చేశారని ఒక ఫేక్‌ వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో అటువంటి వార్తలను ప్రచారంలో పెట్టగల ప్రావీణ్యం ఎవరికి ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఎవరి అధీనంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే.

వార్త ప్రచారమైందే తడవుగా వేల సంఖ్యలో మైతేయ్‌ ప్రజలు గుంపులు గుంపులుగా కుకీ గ్రామాల మీద పడ్డారు. ఒక్కరోజులోనే ఒక వర్గానికి చెందిన వందకు పైగా ప్రార్థనాలయాలు ధ్వంస మయ్యాయంటే, ప్రార్థనలు చేయించేవారిని వెతికి పట్టుకొని దాడులు చేశారంటే మనకు బోధపడుతున్న వాస్తవమేమిటి? అదే వరసలో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి దిగంబరంగా పరేడ్‌ చేయించారు. వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు.

అడ్డుకోబోయిన ఒక అమ్మాయి సోదరుని, తండ్రిని చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్మీ జవాన్‌ భార్య. దేశ రక్షణ కోసం కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నాడు. దేశాన్ని కాపాడాడు. తన భార్యను మాత్రం కాపాడుకోలేక పోయానని విలపిస్తున్నాడు.

దేశాన్ని మెజారిటీ, మైనారిటీలుగా విడగొట్టడంలో మన పరివారం గణనీయమైన విజయాలే సాధించింది. మెజారిటీ వర్గాన్ని రంజింపజేయగల చక్కెరపూత భావ జాలాన్ని అది సృష్టించగలిగింది. అదే నేటి ఆధిపత్య భావజాలం. దేశం మీద పెత్తనం చేస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలానికి మైనారిటీల మీద, నిమ్న జాతుల మీదనే చిన్నచూపు కాదు.

జనాభాలో సగభాగమైన మహిళల మీదా చిన్నచూపే! దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికల మీద జాతీయ పతాకాల్లా ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ దేశం గమనించింది. వాళ్లను అవమానించి వేధించినవాడు దర్జాగా పార్లమెంట్‌లో కూర్చుంటున్నాడు. ఆధిపత్య భావజాలంతో రెచ్చిపోతున్న నికృష్ట మూకలు నగ్నదేహాలతో ఆటలాడటాన్ని కూడా దేశం చూసింది.

నేటి మన ఆధిపత్య భావజాలపు ప్రధాన వ్యూహం టార్గెట్‌ వర్గాలపై అసత్య ప్రచారాలు చేసి ఏకాకుల్ని చేయడం, వారంతా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనే భయాన్ని సమాజంలో కలిగించడం! చేతబడి అనే సాకు చూపి ఒక కుటుంబాన్ని ఊరంతా కలిసి చంపేయడాలు మనకు తెలిసిందే కదా! అదిగో ఆ మూఢత్వానికే మన వాళ్లు జాతీయ హోదా కల్పించారు.

ఇప్పుడా చేతబడి ప్రచారాన్ని కుకీల మీద చేస్తున్నారు. వారంతా పరాయి దేశం వాళ్లట. లవ్‌ జిహాద్, గోహత్య వగైరా వగైరా చేతబడి వ్యూహాలతో ఎల్లకాలం నెట్టుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన గుర్తున్నది కదా! నాటి యూపీఏ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలోకి విసిరేయడంలో చోదకపాత్ర పోషించిన ఉదంతం. మణిపుర మహిళల నగ్న పరేడ్‌ అంతకంటే చిన్న విషయమేమీ కాదు. దాని ప్రకంపనలు ఇప్పుడప్పుడే సద్దుమణగవు. నా దేశం నగ్న దేహం కాదు. అది నవచైతన్య పతాకం.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement