కొత్త అవతారంలో నరేగా! | Sakshi Editorial On MNREGA New Avatar VB-GRAM-G | Sakshi
Sakshi News home page

కొత్త అవతారంలో నరేగా!

Jul 3 2026 12:57 AM | Updated on Jul 3 2026 12:57 AM

Sakshi Editorial On MNREGA New Avatar VB-GRAM-G

ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా నిరుడు డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన వీబీ– జీ రాం జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకొచ్చింది. ఇది రద్దయిన ఉపాధి హామీ పథకం (నరేగా)కు సరికొత్త అవతారం. గత పథకంలోని ‘హక్కుల ప్రాతిపదిక’ను మార్చొద్దనీ, రాష్ట్రాలపై ఆర్థిక భారం పడే విధానానికి స్వస్తిచెప్పి, గతంలో మాదిరే కేంద్రమే భరించాలని పౌరసమాజ కార్యకర్తలతోపాటు కొన్ని రాష్ట్రాలు కూడా కోరాయి. అయితే నరేగా కన్నా ఇదెన్నో రెట్లు మేలని కేంద్రం చెబుతోంది. గత పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి వంద రోజుల పని దినాలకు అనుమతించగా, తాము మరో 25 రోజులు పెంచామని... కూలీల వేతనాలు పెరిగాయని, వారానికోసారి చెల్లింపులు, ఇతర సంస్కరణలు తీసుకురావటంతో అవినీతికి ఆస్కారం ఉండబోదని కేంద్రం చెబుతోంది. పాత పథకంలో ప్రతి 15 రోజులకొకసారి చెల్లించాలన్న నిబంధన ఉన్నా, బ్యాంకింగ్‌ సదుపాయాలు అంతంతమాత్రమే కావటంవల్ల నిరుపేద కుటుంబాలు నెలల తరబడి వేచిచూడాల్సివచ్చేది. ఈలోగా రోజులు గడవటానికి అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేసే వారు. ఇప్పుడు వారానికొకసారి వేతనాలిస్తామంటున్నా ఈ లోటుపాట్లు సరిదిద్దకపోతే నిరుపయోగమే. 

గ్రామీణ కూలీలకు మరో 25 రోజులు పనిదొరకటం, అందువల్ల అదనపు ఆదాయం రావటం హర్షించదగ్గది. అయితే నరేగాకింద గ్రామాల్లో సంబంధిత పక్షాల సమావేశాల నిర్ణయాల ఆధారంగా చేయించాల్సిన పనులు ఖరారయ్యేవి. తాజా చట్టం ప్రకారం అలాంటి పనులేమిటో కేంద్రం ‘వాస్తవ ప్రమాణాల’ ఆధారంగా నిర్ణయిస్తుంది. దాని కయ్యే వ్యయాన్ని కూడా అంచనా వేస్తుంది. అందులో 40 శాతాన్ని రాష్ట్రం భరిస్తే, మిగి లిన 60 శాతం నిధులు కేంద్రంనుంచి వస్తాయి. చేయించాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం ఆధారంగా వివిధ రాష్ట్రాలకు వేర్వేరు కేటాయింపులుంటాయి. కేంద్రం నిర్దేశించిన పనులకన్నా అధికంగా చేయించదల్చుకుంటే అందుకయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. 

పాత పథకంలో నిధుల దుర్వినియోగం మాట వాస్తవం. కనబడని మనుషుల పేర్లతో కైంకర్యం చేసిన ఉదంతాలు అనేకం బయటపడ్డాయి. అందుకే హిందీ రాష్ట్రాల్లో ‘పిశాచ లబ్ధిదారుల’న్న పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న సాంకేతికత అప్పుడు లేదు. మొత్తం కాగితాలపైనే వ్యవహారాలన్నీ నడిచేవి. ఆన్‌లైన్‌ వ్యవస్థలు, డిజిటల్‌ చెల్లింపులు వచ్చాక ఆ బెడద తగ్గింది. ‘నరేగా’ను అవినీతి పేరుతో కొట్టిపారేయటం సరికాదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2006లో ప్రారంభమైన ఈ పథకం తొలి దశాబ్దకాలంలో దాదాపు కోటిన్నరమంది ప్రజలను దారిద్య్రంనుంచి విముక్తుల్ని చేసింది. ఇది చిన్న విషయమేం కాదు. అలాగే సగటున మహిళలకు 50 శాతం పనులు దక్కేవి. ఈ పథకంవల్ల సాగు పనులకు కూలీల కొరత వస్తున్నదన్న ఫిర్యాదులు ఉండేవి. కానీ జాతీయ గణాంకాలు మాత్రం సాగు పనులు ముమ్మరంగా ఉండే సమయంలో ‘నరేగా’కు డిమాండ్‌ తక్కువేనని చెబుతున్నాయి. కూలీలకు బేరమాడే శక్తి పెరిగిందనీ, వారి కూలీ రేట్లు పెరిగాయనీ అధ్యయనాలు సూచిస్తున్నాయి.  

కొత్త పథకంలో రాష్ట్రాలు కూడా వ్యయం భరించాల్సిరావటం ఒకరకంగా విషాదం. ‘నిధులు నిండుకుంటే హక్కులు నీరసిస్తాయ’ని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. ఈ పథ కానికి కేటాయింపుల కోసం రాష్ట్రాలు ముందుగా సంక్షేమ పథకాలకే... మహిళా సంక్షేమా నికే కోత పెడతాయి. గతంలో నిధులు లేక కాదు... అమలుపై ఆసక్తి కొరవడి అత్యధిక పేదరికం ఉండే బిహార్, ఉత్తరప్రదేశ్‌లు అతి తక్కువ నిధులు వినియోగించాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు నిధుల లేమితో చాలా రాష్ట్రాలు ఆ తోవన పోయినా ఆశ్చర్యం లేదు. మొన్న ఏప్రిల్‌ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బిహార్‌లతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణలు నిధుల భారం మోపటాన్ని వ్యతి రేకించాయి. తాజాగా తమిళనాడు సీఎం విజయ్‌ కూడా గొంతుకలిపారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్‌ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయింది. ఎటూ సంక్షేమాన్ని అరకొరగా చేస్తున్నాం... దాన్ని మరింత కత్తిరిస్తే సరిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అను కుంటున్నట్టున్నారు. ఏదేమైనా ఆచరణలో వచ్చే సమస్యల్ని అధ్యయనం చేశాకైనా వీబీ– జీ రాం జీ ని మెరుగుపరచటం మేలు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement