
విస్తీర్ణంలో చాలా దేశాలతో పోలిస్తే ఎంతో పెద్దదైన మధ్య భారతంలో కొన్ని దశాబ్దాలుగా సాగు తున్న వామపక్ష తీవ్రవాదం క్షీణిస్తున్న జాడలు గత కొన్నేళ్లుగా కనబడుతుండగా... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అబూజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌లో ఆయనతోపాటు మరో 26 మంది నక్సలైట్లు చనిపోయారని, వారిలో పలువురు కీలక నేతలు ఉండొచ్చని అధికారిక ప్రకటన చెబుతోంది.
ఇరుపక్షాల మధ్యా జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాల్లోని ఒక జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారని అధికారిక కథనం. ప్రధాన కార్య దర్శి స్థాయి నేత మరణించటం మావోయిస్టు పార్టీకి నిస్సందేహంగా కోలుకోలేని దెబ్బ. అందుకే కావొచ్చు... ఈ ఎన్‌కౌంటర్ గర్వించదగ్గ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆదివాసీల హక్కుల కోసం, దోపిyీ నిరోధానికీ ఆయుధం పట్టామని చెబుతున్న మావోయిస్టులు ఇన్ని దశాబ్దాల పోరాటంలో తమ చర్యల పర్యవసానాలనూ, వాటి నిరర్థకతనూ గమనించి సరిచేసుకోలేకపోయారని అర్థమవుతుంది. నక్సలైట్ ఉద్యమం పూర్వాపరాలు గమనిస్తే అదెప్పుడూ పడుతూ లేస్తూనే సాగింది. కానీ తమ పోరాటాలపై రాజ్యం ప్రతిసారీ ఎందుకు పైచేయి సాధించ గలుగుతున్నదన్న అంశంపై వారు దృష్టి పెట్టినట్టు లేదు.
అంతకుముందు దేశంలో చెదురుమదురుగా జరిగిన సాయుధ పోరాటాలు అంతరించాయనుకుంటున్న తరుణంలో 1967లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా సిలిగుడి డివిజన్‌లో మారుమూల గ్రామమైన నక్సల్బరీలో రాజు కున్న ఉద్యమం వేగంగా విస్తరించి సీపీఐ(ఎంఎల్) ఆవిర్భావానికి దారితీసింది. మూడేళ్ల లోపునే పోలీసులు ఆ ఉద్యమాన్ని అణిచేయగలిగారు. దానివెంబడే అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వెల్లువెత్తిన ఉద్యమం సైతం ఎన్‌కౌంటర్ల పరంపర తర్వాత మూడేళ్లకే సద్దుమణిగింది.
తిరిగి మరో ఆరేళ్లకు ఉత్తర తెలంగాణలో తలెత్తి విస్తరించిన ఉద్యమం ఒక్కటే దీర్ఘకాలం సాగిందనుకోవాలి. ఈ మూడు చోట్లా ఒకేవిధంగా మొదట్లో మధ్యతరగతి, మేధావి, విద్యార్థి వర్గాలను ఆకర్షించిన ఉద్యమాలు అనంతర కాలాల్లో ఆ వర్గాలకు ఎందుకు దూరమయ్యాయన్న విశ్లేషణను మావోయిస్టులు చేసుకోలేదని వారి ఆచరణ తీరు గమనిస్తే అర్థమవుతుంది. మరోపక్క నక్సల్ ఉద్యమం చీలికలూ, పేలికలూ అయింది. సీపీఐ (ఎంఎల్) భిన్నవర్గాలుగా విడిపోయింది. లిబరేషన్ వంటి పార్టీలు పార్ల మెంటరీ పంథాకు మళ్లి చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నాయి.
పాలకులెవరైనా ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటానికీ, ప్రభుత్వ విధా నాలు సక్రమంగా లేవనుకుంటే ప్రజల్ని కూడగట్టి ఉద్యమించటానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక భూసేకరణ చట్టం సవరించినప్పుడూ, అనంతర కాలంలో సాగు చట్టాలు తీసుకొచ్చినప్పుడూ రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
చివరకు కేంద్రం ఆ చర్యల్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. మావోయిస్టు పార్టీ వీటిని గమనంలోకి తీసుకుందా? అంతక్రితం 1977 తర్వాత ఉద్యమాల్లోకి ప్రజల్ని కూడగట్టడంలో విజయం సాధించినా అటుపై ఆ ఉద్యమాలకు తోడు సాయుధ చర్యలు కూడా మొదలయ్యాయి. పర్యవసానాలు తెలియని యువ తను మొదట్లో ఇవి ఆకర్షించివుండొచ్చు. కానీ ప్రభుత్వ బలగాలు పకడ్బందీ వ్యూహాలు అమలు చేయటం ప్రారంభించాక ఆ సాయుధ చర్యలు వ్యతిరేక ఫలితాలిస్తాయి.
సమస్యలెన్నివున్నా ప్రజలు మౌలికంగా శాంతియుత జీవనాన్ని కోరుకుంటారు. నిత్యం ఉద్రిక్త తల నడుమ అనిశ్చితిలో బతికే స్థితి ఉన్నప్పుడు దాన్నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడటా నికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వాలు అణచివేత చర్యలతోపాటు వారి ప్రశాంతతకు హామీ ఇచ్చిన ప్పుడు సహజంగానే ఉద్యమాల వైపు మొగ్గు తగ్గుతుంది. మొదట్లో ఉన్నత చదువులు చదివినవారు భద్రమైన జీవితాన్నీ, బంగారు భవిష్యత్తునూ వదులుకుని ఆ ఉద్యమాల వైపు వెళ్లిన మాట వాస్తవం.
అందుకు నిరుద్యోగం, ప్రభుత్వ వ్యవస్థల్లో పెరిగిన అవినీతి వంటివి కారణం అయ్యాయి. కానీ 1990వ దశకం చివరిలో ప్రపంచీకరణ తర్వాత మన దేశంలో పెట్టుబడులు వెల్లువలా రావటం, యువతకు మెరుగైన అవకాశాలు ఏర్పడటం మొదలయ్యాక ఉద్యమాల పట్ల విముఖత ఏర్పడింది. ఈ తరం విద్యార్థులు అటువైపు వెళ్లటం మాట అటుంచి, వారిలో అత్యధికులకు ఆ ఉద్య మాలపై కనీస అవగాహన కూడా లేదు. మావోయిస్టు ఉద్యమంలో కొత్త రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఉద్యమంలో మధ్యతరగతి వర్గానికి బదులు ప్రస్తుతం ఆదివాసీల ప్రాబల్యం గతంతో పోలిస్తే పెరిగింది. కానీ దానికి సమాంతరంగా ఆదివాసీలను తమవైపు తిప్పుకోవటంలో భద్రతా బలగాలు సైతం విజయం సాధించగలిగాయి. నంబాల కేశవరావు తదితర ఉద్యమ నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించటం ఆ పర్యవసానమే! వర్తమానంలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంకేతికత సైతం బలగాలకు అందివచ్చింది.
నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అది సాధ్యమేనన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదేమైనా ఈ సమస్య హింసకు తావులేకుండా శాంతియుతంగా పరిష్కారమైతే సమాజం సంతోషిస్తుంది. అందుకు మావోయిస్టులు తమ పంథా మార్చుకుని సహకరించాలి. వారు పునరాలోచించుకునేందుకు కేంద్రం కూడా వ్యవధినివ్వాలి.