చేజేతులా చేసుకున్నదే!

Sakshi Editorial On G20 Canada PM Justin Trudeau

జీ20 ముగిసినా దాని ప్రకంపనలింకా తగ్గలేదు. ఢిల్లీ శిఖరాగ్ర సదస్సుకు హాజరై, భారత ఆత్మీయ ఆతిథ్యాన్ని అందుకున్న మిగతా ప్రపంచ నేతలందరికీ ఇది చిరస్మరణీయ అనుభవమేమో కానీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు మటుకు ఇది పీడకలగా పరిణమించింది. భారత ప్రధాని నుంచి సాదర స్వాగతం అందకపోగా, ఖలిస్తానీ తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయకపోవడంపై ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్‌ ఆయనకు తలంటి పంపినట్టు వార్త.

ఎలాగోలా సదస్సు ముగియగానే తిరుగు ప్రయాణం అవుదామంటే ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు. భారత్‌లో కెనడా ప్రధాని చేదు అనుభవాలన్నీ సొంత గడ్డపై ప్రతిపక్షాలకు కావాల్సినంత మేత ఇచ్చాయి. మంగళవారం ట్రూడో తిరుగు పయనమయ్యారు కానీ, భారత్‌ పర్యటనలో ఆయనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. 

భారత్‌ నుంచి పంజాబ్‌ను వేరుచేయాలని కోరుతున్న ఖలిస్తానీ ఉద్యమకారులు, వారి మద్దతు దార్లపై కెనడా మెతకగా వ్యవహరిస్తోందని భారత వాదన. ట్రూడో మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ తమ దేశీయ విధానమని సమర్థించుకుంటున్నారు. తమ అంతర్గత రాజకీయాల్లో భారత్‌ జోక్యం చేసుకుంటోందనేది కెనడా సర్కార్‌ ఆరోపణ.

జీ20 వేళ ఆదివారం ట్రూడో, మోదీల మధ్య భేటీలో ఇరుపక్షాలూ తమ తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. భారత– కెనడా సంబంధాలు ఇటీవల అంత కంతకూ దిగజారుతున్నాయనడానికి ఆ భేటీ వార్తలే తార్కాణం. ఇరుదేశాల మధ్య చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందమూ నత్తనడకన సాగే ప్రమాదంలో పడింది. ఇది ఎవరికీ శ్రేయోదాయకం కాదు. 

గతంలో 2018లో ప్రధానిగా ట్రూడో తొలి భారత సందర్శన సైతం ఘోరంగా విఫలమైంది. శిక్ష పడ్డ తీవ్రవాదిని విందుకు ఆహ్వానించి, అప్పట్లో ఆయన గందరగోళం రేపారు. అప్పటితో పోలిస్తే, ఇప్పటి పర్యటన మరీ ఘోరం. కీలక మిత్రదేశాల నుంచి దూరం జరిగిన కెనడా, భారత్‌తో తనబంధాన్ని మరింత బలహీనపరుచుకుంది. వెరసి, ఈ ప్రాంతంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లు రెంటికీ కెనడా దూరమైంది.

ఎన్నికల్లో జోక్యం, కెనడియన్‌ పౌరుల కిడ్నాప్, ఆర్థిక యుద్ధతంత్రం వగైరాల వల్ల చైనాకు దూరం జరగడం అర్థం చేసుకోదగినదే. కానీ, రాజకీయ కారణా లతోనే ట్రూడో భారత్‌ను దూరం చేçసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కెనడా జనాభా 4 కోట్ల యితే, భారత జనాభా 140 కోట్లు. కెనడా ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు రెట్టింపు. అలా చూస్తే, భారత్‌తో బంధం కెనడాకు అవసరం, లాభదాయకం. ఆ సంగతి ట్రూడో విస్మరించారు. 

మునుపటి ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌ హయాంలో ఢిల్లీతో వాణిజ్యాన్ని ఒటావా విస్తరించింది. వ్యవసాయ సామగ్రి, ఎరువులు, అణువిద్యుత్‌కు అవసరమయ్యే యురేనియమ్‌ భారత్‌కు కెనడా అందిస్తూ వచ్చింది. ట్రూడో హయాంలో ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఇటీవలే సరికొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని ఆపేశారు. భారత్‌లో మోదీ విధానాలు కెనడాలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తాయని ట్రూడో భావన. అందుకే, వీలైనంత దూరం జరగాలని చూస్తున్నారు.

కెనడాలో ఎక్కువగా ప్రవాసీ సిక్కులుండడంతో, వారి మద్దతుకై తంటాలు పడుతున్నారు. భారత్‌లో 2020 నాటి రైతుల ఆందోళనలపై ట్రూడో మాట్లాడుతూ ఇప్పుడు జీ20లో అన్నట్టే భావప్రకటన స్వేచ్ఛల్ని ప్రబోధించారు. తీరా కెనడాలో అలాంటి నిరసనలే ఎదురైతే, అత్యవసర చట్టం ప్రయోగించారు. మైనారిటీలపై మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని తప్పుపడుతున్న ట్రూడో కెనడాలో చేస్తున్నది అదే! 

అంతర్జాతీయ సంబంధాల్లో కెనడా ఇప్పుడు దోవ తప్పింది. ఐరాస భద్రతామండలి తాత్కాలిక సభ్యత్వం కోసం ఆ దేశం చేసిన గత రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 20వ శతాబ్దిలో శాంతి పరిరక్షణ ప్రయత్నాలకు మారుపేరుగా, ఐరాస శాంతిపరిరక్షక దళానికి సృష్టికర్తగా నిలిచిన కెనడా ఇప్పుడు ఆ ఊసే ఎత్తని స్థితికి చేరింది. ఒకప్పుడు వర్ణవివక్షపై పోరాటంలో, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఏర్పాటులో ముందుండి, మానవ భద్రతకై మందుపాతరల నిషేధ ఒప్పందం కావాలని కూడా పోరాడిన దేశం గత రెండు దశాబ్దాల్లో ఊహించని మార్గం పట్టింది.

2005 తర్వాత ఆ దేశం తన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోనే లేదు. దేశంలో, ప్రపంచ పరిస్థితుల్లో శరవేగంతో మార్పులు వచ్చినా  ఎప్పటికప్పుడు తాత్కాలిక ప్రతిస్పందనతోనే విదేశాంగ వాహనాన్ని నెట్టుకొస్తోంది. ఫలితంగా ప్రపంచంలో కెనడా పేరుప్రతిష్ఠలే కాదు... ప్రభావమూ దెబ్బతింటోంది. తక్షణమే కెనడా విదేశాంగ విధానానికి దశ, దిశ కావాలని విశ్లేషకులు అంటున్నది అందుకే!

గత ఇరవై ఏళ్ళలో డయాస్పొరా రాజకీయాలు, వ్యక్తిగత రాగద్వేషాలతో కెనడా విదేశాంగ విధానం తప్పటడుగులు వేస్తోంది. మధ్యప్రాచ్యంపై మునుపటి హార్పర్‌ ప్రభుత్వం, భారత్‌తో వ్యవహారంలో ఇప్పటి ట్రూడో సర్కార్‌ వైఖరి అందుకు మచ్చుతునక. చమురు, సహజవాయువు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో కెనడాది అగ్రపీఠం. అలాగే, యురేనియమ్, అనేక కీలక ఖనిజాలు అక్కడ పుష్కలం. దాన్ని సానుకూలంగా మలుచుకొని విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దుకొనే అద్భుత అవకాశం ఉన్నా అక్కడి పాలకులు ఆ పని చేయట్లేదు.

ఇప్పటికైనా కెనడా బయటి ఒత్తిళ్ళను బట్టి నడవడం మానాలి. దేశాన్ని కలసికట్టుగా నిలిపే స్పష్టమైన లక్ష్యాలను పౌరులకు అందించాలి. కీలక అంతర్జాతీయ అంశాల్లో తమ వైఖరిని స్పష్టం చేయాలి. భారత్‌తో బంధాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవడంతో ఆ పనికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే, పాలకుల పనికిమాలిన చర్యల వల్ల కెనడాకు ఆర్థిక నష్టం కలిగితే అది పాలకుల పాపమే. ట్రూడో ఇకనైనా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వదిలి, విశ్వవేదికపై సమస్త కెనడియన్ల ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిది.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top