జయాపజయాలు

Sakshi Editorial On five states election results

మినీ జనరల్‌ ఎన్నికలుగా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు వెలువరించిన విస్పష్టమైన తీర్పు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి, దాని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్‌ తలరాతలను తలకిందులు చేసింది. తెలంగాణలో దక్కిన బొటాబొటీ విజయం ఒక్కటే కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. ప్రధాన రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లతోపాటు ఛత్తీస్‌గఢ్‌ను కూడా గెల్చుకుని మరో ఆర్నెల్లల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమే ముచ్చటగా మూడో సారి కూడా అధికారంలోకొస్తుందని బీజేపీ చాటింది. ఈ మూడుచోట్లనుంచీ 65 లోక్‌సభ స్థానాలున్నాయి.

ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో 36 యేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌)– కాంగ్రెస్‌  కూటమి కొత్తగా ఆవిర్భవించిన జోరమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పీఎం) చేతుల్లో మట్టికరిచింది. అక్కడ ముఖ్యమంత్రి – ఎంఎన్‌ఎఫ్‌ సారథి జోరంతంగాతో పాటు 11 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. ఒకటి రెండు రోజుల్లో ఈ అయిదు రాష్ట్రాల్లోనూ కొత్త సారథులు కొలువుదీరబోతున్నారు. మూడు రాష్ట్రాలు గెలుచుకున్న బీజేపీ గానీ, తెలంగాణ గెల్చుకున్న కాంగ్రెస్‌ గానీ తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాల్సివుంది.

ఈలోగా ఊహాగానాలే షికారు చేస్తాయి. ఒక్క మిజోరంలో మాత్రం జడ్‌పీఎం చీఫ్‌ లాల్దుహోమా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ముందే ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ‘ఇండియా’ కూటమిలో రుసరుసలు వినిపించాయి. హిందీ బెల్ట్‌లో బీజేపీ ప్రభంజనానికి కాంగ్రెస్‌ చేతగానితనమే కారణమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అనటం, తమ పార్టీ అధినేత మమతాబెనర్జీని, కూటమిలోని ఇతర నేతలనూ కలుపుకొని వెళ్లటంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించటం... జేడీ(యూ), ఆర్జేడీలు సైతం అదే తరహాలో మాట్లాడటం త్వరలో జరగబోయే కూటమి సమావేశం ఎలా ఉంటుందో చెబుతున్నాయి.

మొన్న మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచీ ఊహలపల్లకీలో ఊరేగుతున్న కాంగ్రెస్‌ను తాజా ఫలితాలు కిందకు దించాయి. ఈ పంచతంత్రం గట్టెక్కటం ఎలాగోనని సంశయిస్తూ బరిలోకి దిగిన బీజేపీ... తమ నేతలంతా ఒక్కతాటిపై నిలిచారన్న అభిప్రాయాన్ని కలిగించటంలో విజయం సాధించింది.

రణరంగానికి తరలే శ్రేణులపై సైన్యాధిపతికి పట్టుండాలి. అతని ఆదేశాలకు అనుగుణంగా ముందుకురికేందుకు చతురంగ బలాలు సర్వసన్నద్ధంగా వుండాలి. విజయమో, వీరస్వర్గమో అన్నంతగా చెలరేగిపోవాలి. కాంగ్రెస్‌కు సంబంధించి జరిగిందంతా అందుకు విరుద్ధం. అధిష్ఠానం సూచనలు పాటించటానికి రాజస్తాన్‌లో గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమలనాథ్‌ ససేమిరా అన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులతో ఎజెండాలోకొచ్చిన మహదేవ్‌ యాప్‌ కొంపముంచింది.

కనుకనే ఈ మూడుచోట్లా పార్టీ ఆశలు ఆడియాసలయ్యాయి. ‘ఇండియా’ కూటమిలో దాని స్థానాన్ని మరింత బలహీనపరిచాయి. అధికారంలో ఉన్నవారిని సాగనంపే సంప్రదాయం వున్న రాజస్తాన్‌పై కాంగ్రెస్‌కు ఎటూ పెద్దగా ఆశలు లేవు. అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ గత ఏడాదిగా ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలు ఈ సరళిని మారుస్తాయేమోనన్న భయం బీజేపీలో లేకపోలేదు. కానీ మధ్యప్రదేశ్‌లో అలా కాదు. అక్కడ కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నంతగా ప్రచారం జరిగింది.

ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి అత్తెసరు మెజారిటీతో పాలన ప్రారంభించిన కాంగ్రెస్‌కు రెండేళ్లు తిరగకుండానే పొగబెట్టి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. సగటు ఓటరుకు ఆ విషయంలో సానుభూతి ఉన్నదని అందరూ అంటూ వచ్చారు. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంక్షేమ పథకాల జోరు కనబడుతున్నా బీజేపీ సంశయిస్తూనే అడుగులు వేసింది. జాగ్రత్తగా పావులు కదిపింది. సునాయాసంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెసే మళ్లీ అధికారంలోకి రావటం ఖాయమని అందరూ అనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో సైతం ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. 

రాజస్తాన్‌లో గహ్లోత్, యువ నాయకుడు సచిన్‌ పైలెట్‌ల మధ్య నాలుగేళ్లుగా హోరాహోరీ పోరు సాగుతోంది. వారిద్దరిలో ఎవరు నిష్క్రమిస్తే పార్టీకి ఎక్కువ నష్టమో అధిష్ఠానం తేల్చుకోలేక, ఇద్దరి మధ్యా సంధి కుదిర్చేందుకు తంటాలూ పడింది. ఈ అంతర్గత పోరు ఎంత నష్టపరిచిందంటే స్వతంత్రంగా ఉంటూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునే గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి దేశంలోనే తొలిసారి చట్టం తెచ్చిన ఘనతను సైతం ప్రచారం చేసుకోలేకపోయింది. ఇతర సంక్షేమ పథకాలు సరేసరి. ఇక మధ్యప్రదేశ్‌లో దాదాపు 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని ఎందరు మొత్తుకున్నా కమలనాథ్‌ ససేమిరా అన్నారు.

పైగా తాను ఓ వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతిని మరిచి ‘జై జై కమలనాథ్‌’ నినాదాన్ని రుద్దారు. ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్‌ యాప్‌ కుంభకోణం తర్వాత సీఎం బఘేల్‌తో వేదిక పంచుకోవటానికి రాహుల్, ప్రియాంక సిద్ధపడలేదు. సంక్షేమ పథకాలతో ఊదరగొడితే చాలదు... నాయకత్వ పటిమపై విశ్వసనీయత కలిగించాలి. ఆ విషయంలో వైఫల్యమే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ముంచింది.

అటు బీజేపీలో మూడు రాష్ట్రాల్లోనూ స్థానిక నేతలనూ పక్కనబెట్టి అభ్యర్థుల నిర్ణయంలోనూ, ప్రచారవ్యూహంలోనూ అగ్ర నాయకత్వం తనదే పైచేయి అన్నట్టు వ్యవహరించింది. మోదీ సర్వం తానైనట్టు వ్యవహరించారు. అది విజయానికి దోహద పడింది. దాంతోపాటు కాంగ్రెస్‌ వైఫల్యాలు కూడా బీజేపీకి కలిసొచ్చాయి. జనం భావోద్వేగాలపైకాక సంక్షేమం, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించటం కూడా ఆ పార్టీకి పనికొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తోడ్పడుతుందని భావిస్తే అది బీజేపీకే మేలు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top