జనసాధికార జైత్రయాత్ర! | Sakshi
Sakshi News home page

జనసాధికార జైత్రయాత్ర!

Published Sun, Dec 4 2022 3:21 AM

Sakshi Editorial On CM YS Jagan Governance In Andhra Pradesh

చెరువు ఒడ్డున కొంగ ఒకటి ఒంటి కాలిపై నిలబడి జపం చేస్తున్నది. అది చేపల శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తున్నదట! నూరు ఎలుకల్ని భోంచేసిన పిల్లి ఒకటి తీర్థయాత్రలు చేస్తున్నది. ఆ ఎలుకల ఆత్మశాంతి కోసం ఆ పిల్లి మొక్కులు చెల్లిస్తున్నదట! చంద్రబాబు ‘ఖర్మ’ యాత్రలు చేస్తున్నారు. ‘బీసీలూ... బీసీలూ నా పార్టీ మీ కోసమే’నని వేడుకుంటున్నారు. ‘దళిత సోదరులారా! నేను పుట్టింది మీ కోసమే’నని నమ్మబలుకు తున్నారు.  ‘ఆడబిడ్డలారా! మహిళా సాధికారతకు ఆదిగురువు నేనే’నని ఒట్టేసుకుంటున్నారు. బీదా బిక్కీ జనం కాళ్లావేళ్లా పడాల్సి రావడమేమిటి? ఇదేం ఖర్మరా బాబూ నాకంటూ నిట్టూర్పులతో కూడిన ఖర్మయాత్ర చేస్తున్నారు.

ఈ వర్గాలకు తాను చేసిన అన్యాయాన్ని గురించి మాత్రం ఆయన మాట్లాడడం లేదు. క్రూర కర్మములు నేరక జేసితి, మన్నించుడని శరణు కోరడం లేదు. తాను చేసిందంతా బలహీన వర్గాల శ్రేయస్సు కోసమేనని బహిరంగ సభా వేదికల ద్వారా దబాయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో జగన్‌మోహన్‌రెడ్డి నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించడంలో పెద్ద విశేషమేమీ లేదని బాబు అండ్‌ బృందం అభిప్రాయ పడుతున్నది. బాబు అధికారంలో ఉన్న పధ్నాలుగేళ్లు, ప్రతి పక్షంలో ఉన్న పదమూడేళ్ల కాలంలో ఇద్దరంటే ఇద్దరే బీసీలను రాజ్యసభకు పంపించడంలో మాత్రం చాలా గొప్ప మహత్తే ఉన్నదట!

నలుగురు ఉపముఖ్యమంత్రులు సహా డెబ్బయ్‌ శాతం కేబినెట్‌ బెర్తులు బలహీనవర్గాలకు కేటాయించడంలో సామాజిక న్యాయం లేదట! ఎనభై శాతం జనాభా గల ఈ వర్గాలకు చంద్రబాబు 40 శాతం మంత్రి పదవులివ్వడమే అసలుసిసలు న్యాయమట! బలహీనవర్గాల అభ్యున్నతికి ఏర్పాటైన పన్నెండు కార్పొరేషన్లను పడావు పెట్టినందుకు తానే పేదల బంధువునని బాబు చెప్పుకొస్తున్నారు. పన్నెండును యాభై ఆరుకు పెంచి క్రియాశీలం చేయడంలో గొప్పతనమేమున్నదని ఆయన ప్రశ్నిస్తున్నారు.

కులాలకూ, మతాలకూ, ప్రాంతాలకూ అతీతంగా పేద వర్గాల ప్రజలందరూ ఈరోజున ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వెనుక సమీకృతమవుతున్నారు. ఇందుకు కారణాలున్నాయి. ఇంతవరకూ అవకాశాలకు దూరంగా ఉన్న ప్రజాసమూహాల చెంతకు ప్రభుత్వ యంత్రాంగం కదిలి వెళ్తున్నది. ప్రజాధనం పైసాతో సహా పారదర్శకంగా కళ్ల ఎదుట ప్రవహిస్తున్నది. వెనుకబడిన ప్రజలు సమానావకాశాలను కోరుకుంటున్నారు.

వెనుకబడిన ప్రాంతాలు సమానాభివృద్ధిని కోరుకుంటున్నాయి. దేశమేదైనా, రాష్ట్రమేదైనా ఈకాలపు ప్రజల గుండె చప్పుడు ఇదే! సాధికారత ఈ తరానికి తిరుమంత్రంగా మారుతున్నది. వారి ఆకాంక్షలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక ఆలంబనగా మారింది. అందుకే పేద జనమంతా ఆ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నారు. ఈ పరిణామమే ప్రతిపక్షానికి కలవరం కలిగి స్తున్నది. చంద్రబాబు ఖర్మయాత్రకు ఈ కలవరమే కారణం.

చిత్తశుద్ధి లోపం వల్ల చంద్రబాబు ఖర్మ యాత్ర ఫలిత మివ్వడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బలహీనవర్గాల పట్ల చేసిన తప్పులకు ఆయన కానీ, వారసుడు గానీ క్షమాప ణలు చెప్పి ఉండవలసింది. ముక్కు నేలకు రాసి ఉండవలసింది. చెవులు పట్టుకుని గుంజీలు తీసి ఉండవలసింది. ప్రజల పట్ల వారు చేసిన అవమానాలు అమానుషమైనవి.

అత్యాచారాలతో సమానమైనవి. బీసీల తోకలు కత్తిరిస్తానని సాక్షాత్తూ ఆ పార్టీ మూలవిరాట్టే బహిరంగ హెచ్చరికలు చేశారు. బీసీలను, ఎస్సీ లను హైకోర్టు జడ్జీలుగా నియమించరాదనీ, వారికి ఆ స్థాయి లేదనీ ఆయనే స్వయంగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. మహిళలను కించపరిచేవిధంగా మీడియా సమావేశంలోనే లింగ వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలోని ఉత్సవ విగ్రహాలు చేసిన అవమానాలకు అంతూపొంతూ లేదు. స్వయాన అగ్రనేత బావమరిది, పార్టీ నాయకుడు బాలకృష్ణ బహిరంగ వేదికపై నుంచి తీవ్ర అభ్యంత రకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలుగు ప్రజలందరూ గమనించారు. మహిళల్ని కించపరిచే మాటలను ఆయన యథేచ్ఛగా వాడేశారు.

అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీ నాయకుడొకరు దళితులనుద్దేశించి ‘మీకెందుకురా అధికారాలు, పదవులూ. అవేవో మేమే చూసుకుంటామ’ని ఈసడించుకున్న సంగతీ అందరికీ తెలిసిందే. అదే ఎమ్మెల్యే తన ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా తాసిల్దారును జుట్టు పట్టుకొని అవమా నించిన దృశ్యం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఒకాయన ‘దళితులు శుభ్రంగా ఉండరు, స్నానం చేయర’ని చేసిన నీచమైన కామెంట్‌ ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అరాచకాలు అనేకం. సభ్యసమాజంపై చేసిన ఈ నేరాలు క్షంతవ్యం కానివి. ప్రజలచుట్టూ పొర్లు దండాలు పెట్టినా ఈ పాపాలకు నిష్కృతి లేదు. కానీ కనీసం ప్రాయశ్చిత్త ప్రయత్నాన్ని కూడా వారు చేయలేదు. పశ్చాత్తాపం లేని ఖర్మయాత్రలు ఆయన ఎన్ని చేసినా ఉపయోగపడవు. ఏకేశాలు, పీకేశాలు, లోకేశాలు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదు.

చరిత్ర ఎరుగని దారుణమైన ఓటమితో జనం పరాభవిం చినా చంద్రబాబు మనస్తత్వంలో మార్పు లేదు. ఆయన పెత్తందారీ పోకడ మొక్కబోలేదు. పేదల వ్యతిరేక భావజాలం కరిగిపోలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం విద్యను జీర్ణించుకోలేకపోయారు. పేదలంతా ఇంగ్లిషు విద్య చదివితే నౌకర్లు, చాకర్లు ఎట్లా అనే అహంకారం బుసలు కొట్టింది.

ఎల్లో మీడియా సహకారంతో తెలుగు సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జనం తిరగబడేసరికి కొన్నాళ్లు మిన్నకున్నారు. అహంకార సర్పం మళ్లీ బుసకొట్టే ప్రయత్నం చేసింది. చంద్రబాబు ఒకసారి శ్రీకాకుళం పర్యటన నుంచి వస్తూ విశాఖ జిల్లాలో ఒకచోట దారిపక్కన ఉన్న జనాన్ని చూసి ఆగిపోయి వారితో మాటామంతీ కలిపారు.

‘ఆయనేదో (జగన్‌) ఇంగ్లిషు మీడియం అంటున్నారు. ఆయన మాటలు వినకండి. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిం దట. మీ పిల్లలు ఎటూ కాకుండా పోతారం’టూ వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడున్న జనం వెంటనే జై జగన్‌ అంటూ నినదించడంతో నెమ్మదిగా చంద్రబాబు కాలికి బుద్ధి చెప్పారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక చేతన విప్లవాత్మక రూపాన్ని సంతరించుకున్నది. ప్రజలను పేదరికం నుంచి బయటకు తీయడానికి నాణ్యమైన విద్య ఒక బలమైన సాధనమని ఆయన గట్టిగా నమ్మారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఈ దేశ పేద వర్గాలకు ఇచ్చిన సందేశం కూడా అదే. మహాత్మ జ్యోతిబా పూలే ప్రబోధించింది కూడా అదే.

తల్లి సావిత్రిబాయి చెప్పిన పాఠం కూడా అదే. శ్రీ నారాయణ గురు ఉపదేశించిన మంత్రం అదే. పెరియార్‌ చెప్పిన సలహా అదే. జగన్‌ ప్రభుత్వం ఎంచుకున్న బాట కూడా అదే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటివారంలో విద్యా రంగంపై ఆయన సమీక్ష జరిపారు. ఆ సమీక్షలోనే తాను చేపట్టబోయే విద్యారంగ విప్లవానికి ప్రభుత్వ స్కూళ్లను సమాయత్తం చేసే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి రూపుదిద్దారు.

ఇప్పుడు గ్రామగ్రామానా రూపురేఖలు మార్చుకొని కొత్త రంగులు అద్దుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాలే ఆయన చిత్తశుద్ధికి నిలువెత్తు సాక్ష్యాలు. ‘నాడు–నేడు’ కార్యక్రమానికి చేసిన భారీ వ్యయానికి అదనంగా అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన, విద్యాకానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద కార్యక్రమాలపై ఇప్పటికే 42 వేల కోట్లకు పైగా జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది.

విద్యారంగం తర్వాత మరో ప్రాధాన్యతగా ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వం ఎంచుకున్నది. ఈ రంగంలో కూడా ‘నాడు–నేడు’ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చి అవసరమైన సౌకర్యాలను సమకూర్చింది. ప్రతి గ్రామంలో విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. ఒక్క వైద్య–ఆరోగ్య రంగంలోనే దాదాపు 50 వేల ఉద్యోగ నియా మకాలను పూర్తి చేసిందంటేనే ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది.

ప్రజారోగ్య రంగంలో గేమ్‌ ఛేంజర్‌ కాబోతున్న ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ఆలోచనకు పదును పెడుతున్నది. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం లబ్ధిదారుల్లో తొంభై తొమ్మిది శాతం ప్రజలు బలహీనవర్గాల వారు, అగ్రవర్ణ పేదలే. వారు సాధికారతను సంతరించుకొనే క్రమంలో ఈ రంగాలు రెండూ నిచ్చెన మెట్ల వలె ఉపయోగపడతాయి. ఆ ఎరుకతోనే ప్రభుత్వం ఈ రంగాల్లో బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది.

విద్య, వైద్య రంగాలతో పాటు రాష్ట్రంలో అత్యధిక ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభుత్వం ఫోకస్‌ ఏరియాగా ఎంపిక చేసుకున్నది. ఊరూరా వెలసిన రైతు భరోసా కేంద్రాలు, వాటికి అనుబంధ కియోస్క్‌లు వ్యవసాయ రంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి. రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, మత్స్యకార భరోసా కార్యక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వం 37 వేల కోట్ల రూపాయల నగదు బదిలీ (డీబీటీ)ని లబ్ధిదారులకు అందజేసింది.

ఈ లబ్ధి దారులంతా బలహీనవర్గాలు, అగ్రవర్ణ పేదలే. డీబీటీ, నాన్‌ డీబీటీ పద్ధతుల్లో పేదవర్గాల ప్రజలకు ఈ మూడున్నరేళ్లలో 3 లక్షల 20 వేల కోట్లను బదిలీ చేశారు. ఒక్కపైసా దుర్వినియోగం కాకుండా, వృథా కాకుండా ఇంత పెద్దమొత్తం ప్రజల చేతికందిన ఉదాహరణ ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజా సంక్షేమ – సాధికారతా కార్య క్రమం ఒక్కటే. ఈ మొత్తంలో 1 లక్షా 65 వేల కోట్ల లబ్ధి ఒక్క బీసీ వర్గాలకే జరిగింది. వారి జనాభా నిష్పత్తిని దాటి బీసీలకు అండగా ప్రభుత్వం నిలబడింది. వాస్తవాలు ఇట్లా వుంటే తమది బీసీల పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటే వినేది ఎవ్వరు?

నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగం కీలకమైనదిగా భావించాలి. అంబేడ్కర్‌ భావజాలాన్ని, ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని మనసావాచా కర్మణా గౌరవించే ప్రభు త్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో ముందడుగు వేశామని ఆయన చెప్పారు. తన ప్రభుత్వ దృక్పథాన్ని ఆయన ఢంకా బజాయించి ప్రకటించారు.

ఆయన ప్రకటించిన స్ఫూర్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వాడవాడనా జనచేతనమై జ్వలిస్తున్నది. అధికార వికేంద్రీకరణ కొత్త పుంతలు తొక్కింది. గ్రామ సచివాలయాల రూపంలో ఊరూరా మినీ రాజధాని ఏర్పడింది. ప్రధాన రాజ ధాని కూడా మూడు ప్రాంతాల్లో ఉండాలన్న అధినేత అభిమతా నికి మద్దతుగా కోట్ల గొంతుకలు కోరస్‌ పలుకుతున్నాయి.

ప్రభుత్వ అండదండలతో, ఆలంబనతో జనసాధికారత కోసం చైతన్య యాత్రలు ప్రారంభమవుతున్నాయి. రేపు వికేంద్రీకరణ కోసం కర్నూలు ఎలుగెత్త బోతున్నది. మరో మూడు రోజుల్లో బీసీ వర్గాలు విజయవాడలో చైతన్య శంఖాన్ని పూరించబోతు న్నారు. ఇకముందు రాష్ట్రంలో ఒంటరి పాదయాత్రలకు బదులు జనసమూహాల జైత్రయాత్రలే కనిపిస్తాయి. శ్రీశ్రీ చెప్పినట్టు ‘వస్తున్నా యొస్తున్నాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథ రథచక్రాల్‌... లొస్తున్నా యొస్తున్నాయి’!

వర్ధెల్లి మురళి

vardhelli1959@gmail.com

Advertisement
Advertisement