ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..! | Sakshi Editorial On Chandrababu Govt One Year Rule By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!

May 25 2025 12:48 AM | Updated on May 25 2025 12:48 AM

Sakshi Editorial On Chandrababu Govt One Year Rule By Vardhelli Murali

జనతంత్రం

చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్‌’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.

హిందూపూర్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఒక వ్యూ పాయింట్‌.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్‌ వియ్యంకుడు ప్లస్‌ మాస్‌ మసాలా హీరో – బాక్సాఫీస్‌ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్‌ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్‌లో నిలబడితే రైలు కూత వాయిస్‌లో అభివృద్ధి సౌండ్‌ వినిపిస్తుంది.

బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్‌ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్‌లో బతుకు బండిని అందుకోగలుగుతారు.

మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్‌ వలసల్లో డైలీ షటిల్‌ పద్ధతి  కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.

వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.

తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. 

ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్‌ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్‌’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్‌ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. 

ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్‌ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!

మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు  పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్‌’ నివేదికలోని అంశాన్ని జగన్‌ జనం ముందు పెట్టారు. జగన్‌ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్‌’ కుండబద్దలు కొట్టింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్‌మోహన్‌రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్‌ ఆదాయం.

ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్‌ రూమ్‌ తయారైంది. ఇక బెల్ట్‌షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్‌షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్‌షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్‌ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్‌ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!

ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్‌ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్‌ రూమ్‌ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌షాపులు, బార్లు రౌండ్‌ ది క్లాక్‌ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్‌పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్‌ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.

సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్‌ చేసింది. 

ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్‌ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. 

ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్‌గా గణాంకాల సహితంగా జగన్‌ నిరూపించారు.

గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.

అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు  ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్‌మోహన్‌రెడ్డి కూడా హెచ్చరించారు. 

భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.

ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్‌ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! 

ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement