ఇది మోదీ ఎక్స్‌ప్రెస్‌!

Pm Narendra Modi Charisma In Other Countries Golden Era Of History In Making - Sakshi

గమనించాలి... గ్రహించాలే కానీ సంఘటనలన్నీ ఏదో ఒక సంకేతమిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జరిపిన మూడు దేశాల పర్యటన చూస్తే అదే అనిపిస్తుంది. ప్రపంచ దేశాధినేతల ప్రత్యేక ప్రశంసలు, ప్రవాస భారతీయుల నుంచి జయ జయ ధ్వానాలు మోదీకే కాదు... భారత్‌కు పెరిగిన ప్రాధాన్యాన్నీ, ప్రతిష్ఠనూ సూచిస్తున్నాయి. జపాన్‌లో ‘జీ7’ దేశాల సదస్సులో అతిథిగా హాజరైనప్పుడూ, పాపువా న్యూ గినియా నేత ఏకంగా పాదాభివందనం చేసినప్పుడూ, ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల ‘మోదీ’ నాదాలు చూసినప్పుడూ వెలువడ్డ సంకేతం అదే.

కర్ణాటకలో పదే పదే పర్యటించి, భారీ సభలు, ఊరేగింపులు నిర్వహించినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారం చేజార్చుకున్న బీజేపీ నేతగా స్వదేశంలో సన్నాయి నొక్కులు వినిపిస్తూ ఉండ వచ్చు. ప్రధానిగా బాహ్య ప్రపంచంలో మాత్రం మోదీ సమ్మోహన మంత్రానికి తరుగు, తిరుగు లేదని అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అగ్ర రాజ్యాల దాకా అన్నీ.. అతిపెద్ద మార్కెటైన నవభారతంతో భుజాలు రాసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయని తెలుస్తుంది. 

హిరోషిమాలో ‘జీ7’ సదస్సుకు హాజరైన ప్రధాని ఆ పైన ద్వీపదేశమైన పాపువా న్యూ గినియాను తొలిసారి సందర్శించారు. ‘భారత – పసిఫిక్‌ ద్వీపదేశాల సహకార వేదిక’ (ఎఫ్‌ఐపీఐసీ) మూడో సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఆ దేశానికి ఒక భారత ప్రధాని వెళ్ళడం ఇదే ప్రథమం. ఏడాది క్రితం పదవి చేపట్టిన లేబర్‌ పార్టీ నేత, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ఆహ్వానంపై మోదీ సిడ్నీలో పర్యటించారు. అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం, వ్యాపార బృందాల రౌండ్‌ టేబుల్‌తో తన మూడు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించి, స్వదేశానికి తిరిగొచ్చారు.

స్వదేశంలోని రాజకీయ చిక్కులతో అమెరికా అధ్యక్షుడు వైదొలగేసరికి ఆస్ట్రేలియాలో జరగాల్సిన ‘క్వాడ్‌’ సదస్సును లఘువుగా జపాన్‌లోనే అధినేతలు జరిపేశారు. ఆస్ట్రేలియాతో పటిష్ఠ బంధానికి అవకాశం వదులుకోని మోదీ తన పర్యటనను సమయానికి తగ్గట్టు ద్వైపాక్షిక సందర్శన చేసేశారు. గత ఏడాది కాలంలో ఆరోసారి అల్బెనీస్‌తో భేటీ, ఈ ఆర్థిక, వాణిజ్య సహకార దోస్తీ ప్రాంతీయ శాంతి సుస్థిర తలకూ కీలకమన్నారు. ‘డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ’– ఈ మూడు ‘డి’లు కీలకమంటూ, శరవేగంతో మెరుగవుతున్న ఇరుదేశాల సంబంధాలకు టీ20 మ్యాచ్‌లతో పోలిక తెచ్చారు.

అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులు, వేర్పాటువాద శక్తుల విజృంభణను మార్చిలో అల్బనీస్‌తో ప్రస్తావించినా ఇప్పుడూ ఆ ఊసెత్తడం స్నేహదేశానికి ఒకింత ఇబ్బందికరమే. అది అటుంచితే, భారత ప్రధానికి సాదర స్వాగతం పలుకుతూ ఆ దేశంలోని అతి పెద్ద వినోద, క్రీడా ప్రాంగణంలో సాగిన భారీ సంబరం ప్రవాసుల్లో పెరిగిన జాతీయవాదానికి మచ్చు తునక. ‘మోదీ ఎయిర్‌వేస్‌’, ‘మోదీ ఎక్స్‌ప్రెస్‌’ లాంటి పేర్లతో ఆస్ట్రేలియా నలుమూలల నుంచి ప్రత్యేక విమా నాల్లో, రైళ్ళలో అభిమాన జనం తరలివచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి లక్షల కోట్ల రూపాయలను ప్రవహింపజేస్తున్న ప్రవాస భారత ప్రపంచానికి ఒక భరోసా ఇవ్వాలని ప్రధాని భావించినట్టున్నారు. అందుకే, క్రిక్కిరిసిన స్టేడియమ్‌లో ముప్పావుగంట సేపు మాటల మోళీ చేశారు. తొమ్మిదేళ్ళలో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రియతమ నేత పట్ల భారతీయ డయాస్పోరా స్పందన చూసి, అక్కడి పాలకులు సైతం అబ్బురపడ్డారు. 

2014 నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు ఆయన అప్పుడప్పుడే విశ్వవేదికపై నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని. నాడు బ్రిస్బేన్‌లో ‘జీ20’ సదస్సులో ఇతర దేశాలతో స్నేహానికి ఆయన శ్రమిస్తే, నేడు 2023లో అదే భారత్‌ ‘జీ20’కి అధ్యక్ష పీఠం దాకా ఎదిగింది. పోటీ దేశాల కన్నా వేగంగా పెరుగుతున్న దేశమైంది. అప్పట్లో ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌లో బెరుకుగా మాట్లాడిన అదే వ్యక్తి ఇప్పుడు విదేశీ పర్యటనలు, డజన్ల కొద్దీ శిఖరాగ్ర సదస్సుల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా సహచరుడు ‘మోదీ... ది బాస్‌’ అని మైకులో అంటే, వచ్చే అమెరికా పర్యటనలో భారత ప్రధాని వైట్‌హౌస్‌ విందుకు అప్పుడే టికెట్లు అమ్ముడై పోయాయంటూ, ఆటోగ్రాఫ్‌ కావాలని అగ్రరాజ్య అధినేత బైడెన్‌ చమత్కరించడం గమనార్హం. మోదీ మాటల్లోనే చెప్పాలంటే, ‘నేను కలసిన నేతలందరూ ‘జీ20’కి భారత సారథ్యం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది భారత్‌కు గర్వకారణం.’

ఇవాళ భారత్‌ ప్రపంచంలోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. జనాభాలో చైనాను దాటి ప్రపంచంలో ప్రథమ స్థానానికి దూసుకుపోతున్న మన గడ్డపై ఈ మానవ వనరులకు తోడు అపార ప్రతిభ, అరచేతిలో సాంకేతికత ఉన్నాయి. వాణిజ్యం, ఆటోమొబైల్‌ ఉత్పత్తులు, మొబైల్‌ తయారీ, అందివచ్చిన అంకుర సంస్థల ఉద్యమం లాంటి అనేక సానుకూలతలతో పురోగమిస్తున్న భారత్‌ వైపు ప్రపంచం చూస్తున్నది. హరిత ఉదజని టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు ఖరారు చేసుకోవడం మొదలు వలసలు – రాకపోకల భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపీఏ) దాకా ఆస్ట్రేలియా – భారత్‌లు తాజాగా సంతకాలు చేయడం ఆ ధోరణికి కొనసాగింపే! ఇవన్నీ విద్యార్థులు, వృత్తి నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తల రాకపోకలను సులభతరం చేస్తాయి. ఆర్థిక, దౌత్య సంబంధాలైనా, అత్యంత కీలకమైన భౌగోళిక వ్యూహాత్మక దోస్తీలైనా బాగుండాలంటే మనుషుల మధ్య ఆత్మీయ బంధాలు ప్రధానం. ప్రజాస్వామ్య దేశాలతో, ప్రవాస భారతీయులతో కలసి అడుగులు వేస్తున్న నమో భారత్‌ అనుసరిస్తున్న మార్గమూ అదే!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top