దేవీపట్నం: ప్రమాదశాత్తు నిప్పంటుకుని ఒక టిప్పర్ లారీ దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా నల్లమట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీ ఆదివారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. పోలవరం జలవిద్యుత్కేంద్ర సమీపంలో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బయటపడ్డాడు. టిప్పర్ లారీ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.
పూణే మారథాన్ విజేత రామరాజు
ఆత్రేయపురం: లొల్ల గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ప్రస్తుత బ్యాంకు ఉద్యోగి దాట్ల రామరాజు ఆదివారం పూణేలో జరిగిన హాఫ్ మారథాన్ పోటీలలో విజేతగా నిలిచాడు. పూణే కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎంఈ షోల్డర్ దాన్, 4వ ఎడిషన్ పోటీలలో 21.1 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని కేవలం ఒక గంట 21 నిమిషాల్లో విజేతగా నిలిచాడు. భారత సైన్యం నుంచి ఈ పతకాన్ని అందుకున్నాడు. అతని జీవితంలో వ్యక్తిగత ఉత్తమ రికార్డుగా ఇది నిలిచింది. రామరాజు లొల్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత దాట్ల సూర్యనారాయణ రాజు కుమారుడు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పలువురు ప్రముఖులు రామరాజును అభినందించారు.


