గ్రేటర్‌లో
రాజమహేంద్రవరం సిటీ/ సీటీఆర్‌ఐ: గ్రేటర్ రాజమహేంద్రవరంగా ఏర్పడ్డాక తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పడిపోయింది.. ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం ప్రధాన కారణమని తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచే నగరంతో పాటు విలీన గ్రామాల్లో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సారి రాజమహేంద్రవరం కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఒకవైపు కూటమి అభ్యర్థులు, మరోవైపు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. వీరికి తోడుగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇవ్వడంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది.
ఓటుకు నోటు ఎర
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ పూర్తయ్యే వరకూ మద్యం షాపులన్నీ మూసి వేయాలి. రెండు రోజుల ముందు నుంచే మద్యం షాపులు మూసివేస్తారని తెలిసి కూటమి నాయకులు మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఎన్నికల వేళ మద్యాన్ని ప్రతి డివిజన్‌లో ఏరులై పారించారు. ఇసుక, మద్యం సిండికేట్‌లో దోచుకున్న డబ్బుని ఓటర్లకు పంచారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకూ ఇచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదో రకం ‘పది’కం
కూటమి అభ్యర్థులు ఓటుకు నోటు అంటూ ఓటర్లను ప్రలోభపెట్టారు. కూటమి పోటీ చేసిన డివిజన్లలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరికీ మూడు వేల పది రూపాయలు పంపిణీ చేశారు. అభ్యర్థి నెగ్గిన తరువాత రూ.పది నోటు తీసువచ్చిన వారికి మరో రూ.వెయ్యి అదనంగా ఇస్తాననడంతో రూ.10 నోటుని ఎలా భద్రపరచాలోనని ఓటర్లు జాగ్రత్తగా చూసుకున్నారు.
రూల్స్ ధిక్కరించి..
పోలింగ్ బూత్‌ల వద్ద 30 మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదు. ఇద్దరు కంటే ఎక్కువ మంది గుమిగూడితే 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వారి అభ్యర్థులకు మద్దతుగా పోలింగ్ బూత్‌ల వద్ద నిలబడి తమకు ఓటు వేయమని ప్రచారం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వారిని అక్కడి నుంచి వెళ్లమని అడగటంతో స్థానిక 68వ డివిజన్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చి వైఎస్సార్ సీపీ నాయకులను పంపించేశారు. కానీ కూటమి నాయకులను మాత్రం అక్కడే ఉండనిచ్చారు. 68వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి భర్త పార్టీ కండువాతో బూత్‌లలో హల్‌చల్ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పడంతో పోలీసులు అతనిని అక్కడి నుంచి పంపించేశారు.
అధికారుల పరిశీలన
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటింగ్ నిర్వహణ తీరు, కల్పించిన సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగిందని అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
హడావుడే కొంపముంచింది
గత పోలింగ్ సరళి ఇలా..
గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ శాతం నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్‌గా 1994లో అప్‌గ్రేడ్ అయిన తర్వాత, 2002, 2007, 2014 సంవత్సరాల్లో మూడు సాధారణ ఎన్నికలు జరిగాయి. తర్వాత డివిజన్ల పునర్విభజన, న్యాయపరమైన కారణాల వల్ల సుదీర్ఘ విరామం అనంతరం ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట్లో 2022లో 44 డివిజన్లతో ఎన్నికలు నిర్వహించారు. 2001 ఎన్నికల జామితా ప్రకారం 1,78,000 ఓటర్లు ఉన్నారు. 2007, 2014లలో 50 డివిజన్లకు పెంచి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు గ్రేటర్ కావడంతో 72 డివిజన్లలో పోలింగ్ జరిగింది.
గత ఎన్నికల్లో ఇలా..
ఏడాది ఓటర్లు శాతం
2002 1,78,000 60
2007 1,95,840 63
2014 2,29,650 66
2026 4,63,323 57.01
భవిత బ్యాలెట్‌లో భద్రం
పోలింగ్ ముగియడంతో రాజమహేంద్రవరం పీఠం ఎవరికి దక్కనుందో అనేది ఈ నెల 30న జరుగనున్న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. మొత్తం 463,323 మంది ఓటర్లకు గాను 2,64,128 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో 57.01 శాతం పోలింగ్ నమోదైంది. 63వ డివిజన్‌లో 77.76తో ఎక్కువగా, 45వ డివిజన్‌లో 35.83 శాతంతో తక్కువగా పోలింగ్ నమోదైంది. మొత్తం 72 డివిజన్లలో 491 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ తర్వాత సీజ్ చేసిన బ్యాలెట్ బాక్స్‌లను ప్రత్యేక వాహనాలలో పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం శ్రీకందుకూరు వీరేశలింగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.
ఫ రాజమహేంద్రవరంలో తగ్గిన పోలింగ్
ఫ ఏర్పాట్లలో వైఫల్యమే కారణం
ఫ ఎన్నికల వేళ ఓటర్లకు ‘కూటమి’ ఎర
ఫ ఎక్కడికక్కడే నిబంధనల ఉల్లంఘన
గ్రేటర్ రాజమహేంద్రవరంగా ఏర్పాటైన తర్వాత ఎన్నికలను హడావుడిగా నిర్వహించడంతో పోలింగ్ శాతం తగ్గిందని పలువురు విశ్లేషిస్తున్నారు. అధికారులకు అవగాహనా రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని అంటున్నారు. పోలింగ్ బూత్‌ల విభజన సక్రమంగా జరగక ఓటర్లు తికమక పడ్డాడు. తమ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో తెలియక ఓటు వేసేందుకు సైతం వెనుకాడారు. కొన్ని కేంద్రాలలో ఉదయం 10 గంటలకు కూడా ఓటర్లు లేకపోవడం శోచనీయం. సరిహద్దులను ఇష్టం వచ్చినట్లు విభజించడంతో వచ్చిన పరిస్థితి ఇది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులను అందజేయాల్సిన ఉండగా.. తూతూమంత్రంగానే కానిచ్చారు. దీనిపై సమాధానం చెప్పేవారు లేకపోయారు. సిప్పులు కొందరికి ఇచ్చినా ఫలానా ప్రాంతం అని అందులో నమోదు చేయకుండా స్కూల్ పేరు ఒక్కటే ఇవ్వడం గందరగోళానికి గురిచేసింది. అలాగే దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఓటు వేసేందుకు సాహసం చేయలేదు. విలీనం జరిగిన గ్రామాల్లో ప్రధానంగా ఈ సమస్య ఉంది. అందువల్లే ఓటింగ్ శాతం పడిపోయిందని చాలా మంది అంటున్నారు. ఆయా బూత్ వద్ద వీల్ చైర్లు, నీరు అందుబాటులో లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలాగే సమాచారం చెప్పేందుకు కూడా ఎవరూ లేకపోవడం శోచనీయం.
ఆకలితో అలమటించిన సిబ్బంది
పోలింగ్ సిబ్బంది ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో తయారు చేసిన ఆహారం అందజేయడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిబ్బంది వాపోయారు. బుధవారం రాత్రి 10.30 గంటలకు, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పాడైన ఆహారం అందించారని వారు అన్నారు.


