● అన్నవరం దేవస్థానంలో
దిద్దుబాటు చర్యలు
● ‘సాక్షి’ కథనంతో కదిలిన యంత్రాంగం
● కొత్త ఈఓ లక్ష్మీ శివజ్యోతి పలు ఆదేశాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వెలిగిస్తారా ప్రగతి ‘జ్యోతి’ శీర్షికన వచ్చిన కథనానికి కొత్త ఈఓ కె.లక్ష్మీ శివజ్యోతి స్పందించారు. పలు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీ కారణంగా తూర్పు రాజగోపురం ఎదురుగా మెట్ల వద్ద ఉన్న గేటును మూసివేసి యాగశాల పక్కన మెట్ల ద్వారా ఆలయ ప్రాంగణంలోకి పంపించడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో మూసిఉన్న గేటును స్వయంగా పరిశీలించిన ఆమె, దానిని తెరిచి ఉంచాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డులను పెట్టి నియంత్రించాలే తప్ప, గేట్లు మూసివేయకూడదని ఈఓ ఆదేశించారు. అదే విధంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వ్రత మండపాల్లో కొబ్బరికాయలు కొట్టే చోట అపరిశుభ్రంగా ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నీళ్లు నిలిచిపోవడం గమనించి వెంటనే శుభ్రం చేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో సన్ డయిల్ వద్ద కూడా అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పారిశుధ్యం మరంత మెరుగు పడాలని ఆదేశించారు.
షాపుల లీజు బకాయిలపై రేపు సమీక్ష
దేవస్థానంలోని వివిధ షాపుల లీజు బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయిన నేపథ్యంలో వాటి వసూలుకు తీసుకుంటున్న చర్యలపై శనివారం సంబంధిత విభాగం అధికారులతో ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వివిధ షాపుల వేలం మొత్తం, బకాయిల వివరాలతో హాజరవ్వాలని ఆదేశించారు. కాగా పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న లారెల్స్ విశ్రాంతి షెడ్డు వెనుక రోడ్డు పక్కన చెత్త ట్రాక్టర్‌ను తొలగించాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు తొలుత ఇదే దర్శనమిస్తుంది. ఇక్కడ చెత్తతో ట్రాక్టర్ తొట్టి నిండిపోయాక కూడా అక్కడ నుంచి తొలగించడం లేదు. వాస్తవానికి రెండు ట్రాక్టర్ తొట్టెలు ఉండాలి. ఒక తొట్టి చెత్తతో నిండిపోయాక దానిని డంపింగ్ యార్డుకు తరలించాలి. అక్కడ ఇంకో ట్రాక్టర్ తొట్టె ఏర్పాటు చేయాలి. రెండోది నిండిపోయాక మొదటి తొట్టిని అక్కడ ఉంచి, చెత్తతో నిండిన రెండో తొట్టెను ట్రాక్టర్‌తో డంపింగ్ యార్డుకు తరలించాలి.
ప్రసాదం, వ్రతాలకు కూతవేటు దూరంలో..
ఈ విశ్రాంతి షెడ్డులోని కౌంటర్‌లోనే రూ.200 అంతరాలయం టిక్కెట్ భక్తులకు ప్రసాదం ప్యాకెట్లు అందజేస్తారు. వాటి కోసం భక్తులు ఇక్కడకు వస్తారు. అదే విధంగా వ్రతాలు, ఇతర పూజా టిక్కెట్లు కూడా ఇక్కడి కౌంటర్లలోనే ఇస్తారు. భక్తులు కొండ దిగువకు, రైల్వే స్టేషన్ కోసం వెళ్లే బస్సుల కోసం ఇక్కడే వేచి ఉంటారు. ఇంత కీలకమైన చోట ఈ చెత్త ట్రాక్టర్‌ను పెట్టి చెత్త పోగు వేయడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఈఓ
అన్నవరం దేవస్థానం ఈఓ లక్ష్మీ శివజ్యోతి కలెక్టర్ హరింధర్ ప్రసాద్‌ను కాకినాడలో మర్యాద పూర్వకంగా కలిసి సత్యదేవుని ప్రసాదం, మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానంలో ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. సత్యదేవుని ప్రసాదం, అన్నదానంలో భోజనం రుచిగా ఉండేలా చూడాలని అన్నారు.


