ప్రత్తిపాడు రూరల్: రాచపల్లి గ్రామానికి చెందిన పలువురు గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. బంకు శ్రీను యూత్ ఆధ్వర్యాన వివిధ పార్టీలకు చెందిన 15 కుటుంబాల వారు జగన్‌కు జైకొట్టారు. వారికి పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముత్యాల నూకరాజు, మేడిబోయిన బాబ్జీ, పెట్టిం సత్తిబాబు, మడికి చిట్టిబాబు, గింజాల వీరబాబు, పెట్టిం సురేష్, యాళ్ల ప్రకాష్, పెదిరెడ్డి వీరబాబు, పెదిరెడ్డి బాబ్జీ, సారిపల్లి వీరబాబు, ఈగల ఏసుబాబులకు గిరిబాబు కండువాలు వేసి, స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని, ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
1,200 మంది
పోలీసులతో బందోబస్తు
సామర్లకోట: జిల్లాలో ఎన్నికలకు 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. వీరితోపాటు రూట్ మొబైల్ టీము, స్ట్రైకింగ్ ఫోర్సులను వినియోగించామని చెప్పారు. జి.మేడపాడు పోలింగ్ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ముందు నుంచీ గ్రామీణుల్లో అవగాహన పెంచడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు సిబ్బంది పని చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఏబీజీ తిలక్, సీఐ ఎ.కృష్ణభగవాన్, సిబ్బంది పాల్గొన్నారు.
మేయర్ పీఠం
వైఎస్సార్ సీపీదే
కాకినాడ రూరల్: నగర మేయర్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ దక్కించుకోబోతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖప ట్నం, విజయనగరం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 66వ డివిజన్‌లో తన సోదరుడు, సినీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పార్టీ మేయర్ అభ్యర్థి కాద సత్యశ్రీ, వెంకట రమణ దంపతులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు. వైఎస్సార్ సీపీ తరఫున జనరల్ ఏజెంట్‌గా వ్యవహరించిన కన్నబాబు.. మేయర్ అభ్యర్థి సత్యశ్రీతో కలిసి రూరల్‌లోని తొమ్మిదింటితో పాటు సిటీలోని పలు డివిజన్లను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ఓటర్లు చాలా తెలివైనవారని, ఉన్నత విద్యావంతులని వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. పోలింగ్ సరళి చూస్తే నిశ్శబ్ద విప్లవంలా తమ మేయర్ అభ్యర్థి సత్యశ్రీకి సైలెంట్ ఓటింగ్ పడినట్లు అర్థమవుతోందని, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఆశ్రమ పాఠశాలలో
కలెక్టర్ తనిఖీలు
గంగవరం: గంగవరంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.దినేష్‌కుమార్ గురువారం సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యత, వసతి సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలోని వంటశాలను సందర్శించి వంటకాల తయారీ విధానం, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత గురించి ఆరా తీశారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న అన్నం, కూరలు తదితర ఆహార పదార్థాల నాణ్యత వివరాలు వంట సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనం చేసేందుకు వరుసలో ఉన్న విద్యార్థినులతో మాట్లాడి భోజనం రుచి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? ఏయే కూరలు వడ్డిస్తున్నారు? సాయంత్రం స్నాక్స్ క్రమం తప్పకుండా అందిస్తున్నారా? అని ఆరా తీశారు. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని, వసతి గృహంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత పాఠశాల, వసతి గృహ సిబ్బందికి సూచించారు.


