● జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు
● సభ్యులతో ఆత్మీయ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గత ఐదేళ్లుగా అందించిన పాలన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జెడ్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా పరిషత్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో సుమారు రెండున్నరేళ్లు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ కాలంలో మరో రెండున్నర సంవత్సరాలు నిరంతరాయంగా పాలన అందించామని చెప్పారు. ఈ ఐదేళ్లలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను అధిగమించి, కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ, పంచాయితీరాజ్ చట్టం నిబంధనలకు లోబడి నిర్ణీత కాల వ్యవధిలో జెడ్పీ సర్వసభ్య, స్థాయీ సంఘ సమావేశాలు సక్రమంగా నిర్వహించామని అన్నారు. సుమారుగా 1,560 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. జెడ్పీ సాధారణ నిధులతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, రహదారులు, డ్రైనేజీ, మంచినీరు, విద్య, వైద్యం, కమ్యూనిటీ వసతులు, వ్యవసాయ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని వివరించారు. ఐదేళ్లలో 1,550 అభివృద్ధి పనులు మంజూరు చేసి, ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలకు సమాన నిష్పత్తిలో నిధులు కేటాయించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సుమారు 64 పంపింగ్ పథకాలకు సంబంధించిన పనులకు ఐదేళ్లలో దాదాపు రూ.300 కోట్లు వినియోగించామని విప్పర్తి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి అవసరమైన వైద్యం అందేలా కృషి చేశామని చెప్పారు. నాలుగు జిల్లాలుగా పునర్విభజన అయినప్పటికీ, ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాలనూ సమాన దృష్టితో చూసి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామని తెలిపారు. పదవి శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవే శాశ్వతమనే స్ఫూర్తితో ఐదేళ్ల పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించానని ఆయన చెప్పారు. ఈ ఐదేళ్లలో 177 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించామన్నారు. తనకు సహకరించిన నాయకులు, అధికారులకు వేణుగోపాలరావు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఇతర సభ్యులు జెడ్పీ చైర్మన్‌ను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


