● ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
● 6.90 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
గణపవరం: చెడు వ్యసనాలకు బానిసలై మూడు జిల్లాల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను గణపవరం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.6.90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గణపవరం సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏలూరు డీఎస్పీ డి.శ్రవణ్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామానికి చెందిన కంచర్ల జార్జి బెన్నీ (22), భీమవరం మండలం అనాకోడేరు గ్రామానికి చెందిన ఎల్లమిల్లి సతీశ్‌బాబు (23), కాకినాడకు చెందిన దేవ ప్రకాష్ (30) స్నేహితులు. వీరు కొంతకాలంగా చెడు వ్యసనాలకు, విపరీతమైన ఖర్చులకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు వీరిపై ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని 8 పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదయ్యాయి.
పోలీసుల ముమ్మర దర్యాప్తు
ఈ ఏడాది గణపవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిప్పర, అప్పనపేట గ్రామాలలో మూడు దొంగతనాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీనిపై జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ నక్కా రజనీ కుమార్, ఎస్సై ఆకుల మణికుమార్ తమ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గణపవరం పోలీస్ ఐలాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ ముగ్గురినీ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా, వారు చేసిన దొంగతనాల వివరాలు బయటపడ్డాయి. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడు తున్నట్టు తెలిసింది. వారి నుంచి రూ.3.45 లక్షల విలువైన నాలుగు మోటారు సైకిళ్లతో పాటు మరికొన్ని బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.


