రాజమహేంద్రవరం సిటీ: స్థానిక జేఎన్ రోడ్డులోని చెరుకూరి వీర్రాజు, సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో హోమ్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, రాజమహేంద్రవరం చాప్టర్ చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం సంతోష్ ఫణికుమార్, జనరల్ సెక్రటరీ చల్లా బాల మురళీకృష్ణ, ఎన్విరాన్‌మెంట్ కమిటీ మెంబర్ కర్రి శేఖర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎక్స్‌పో నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్వహించిన ఐదు ఎక్స్‌పోలకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈసారి 130 స్టాళ్లతో భారీగా నిర్వహిస్తున్నామని, దీనిలో రకరకాల అధునాతన ఐటమ్స్ ఉంటాయన్నారు. బిల్డర్లు, ఆర్కిటెక్ట్స్ డిజైన ర్లు ఇలా అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల సొంతిల్లు సమకూర్చుకోవాలని వచ్చేవారికి వెసులుబాటు లభిస్తుందన్నారు. సమావేశంలో క్రెడాయ్ రాజమహేంద్రవరం ఉపాధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ, కోశాధికారి టీవీఎల్ నరసింహారావు, కార్యవర్గ సభ్యులు యెజ్జు శ్రీనివాస కిరణ్, బళ్లా వర ప్రసాద్, రుత్తల అనిల్, కోన మోహనరావు పాల్గొన్నారు.


