● చంద్రబాబు, పవన్ కల్యాణ్
సమాధానం చెప్పాలి
● వైఎస్సార్ సీపీ నాయకురాలు
జక్కంపూడి విజయలక్ష్మి
● రాజానగరం వేంకటేశ్వరస్వామి
ఆలయంలో పూజలు
రాజానగరం: తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఈడీ కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో మంగళవారం రాజానగరం రావుల చెరువు గట్టున ఉన్న వేంకటేశ్వరస్వామిని పార్టీ నాయకులతో కలిసి ఆమె దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. గుడి మెట్లను నీటితో కడిగి, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు తినేలా, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఆడిన లడ్డూ డ్రామాపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని 2024లో ఈ పెద్దలు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టిందన్నారు. తాజాగా వెలువడిన దర్యాప్తు వివరాల ప్రకారం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టం చేశారన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని వివాదంలోకి తీసుకువచ్చారన్నారు. పవన్‌కల్యాణ్ ఈ వ్యవహారంపై ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దూలం పెద్ద, జెడ్పీటీసీ సభ్యుడు వాసంశెట్టి పెద వెంకన్న, సీనియర్ నాయకులు గంగిశెట్టి సోమేశ్వరరావు, మండారపు వీర్రాజు, పార్టీ అనుబంధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.


