రాజమహేంద్రవరం సిటీ: నగరాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రూ.300 కోట్లతో 243 అభివృద్ధి పనులకు మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాలకు సుమారు ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నందున మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల అధికారు లు తమ పరిధిలోని పనులపై పూర్తి బాధ్యత తీసుకుని చొరవతో వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం పైస్థాయి సమీక్ష కోసం వేచి ఉండకుండా సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనా, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సహయ కలెక్టర్ కె.ఆదిత్య శర్మ, అదనపు ఎస్పీ దేవరాజ్ మనీష్ పాండే, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సూపరింటెండింగ్ ఇంజినీర్ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్‌ఎన్ మూర్తి, ఈఈలు మదర్షా అలీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.


