మమ అనిపింఛెన్‌! | - | Sakshi
Sakshi News home page

మమ అనిపింఛెన్‌!

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

ఆసరా లేదు, అభాగ్యులమని చెబుతున్నా వినడం లేదు.. కుటుంబ పెద్ద లేక, పూట గడవడం లేదని అంటున్నా పట్టించుకోవడం లేదు.. ఏదో మొక్కుబడి తుంతులా పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను సాగించారు. 24 నెలలు నిరీక్షిస్తే, 9 రోజులు దరఖాస్తులకు అవకాశమిచ్చి మమ అనిపించారు. ధ్రువపత్రాలు తెచ్చుకునే లోపే దరఖాస్తులకు తెరిచిన పోర్టల్‌ను మూసేశారు. దీంతో లబోదిబోమంటూ అనేకమంది అర్హులు సోమవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చి తమ వెతలను అధికారుల వద్ద చెప్పుకొన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండంటూ మొరపెట్టుకున్నారు.

కలెక్టరేట్‌లో అర్జీలు అందించేందుకు వచ్చిన జనం

ఆన్‌లైన్‌ చేయించేందుకు నిరీక్షిస్తున్న అర్జీదారులు

సాక్షి, రాజమహేంద్రవరం/సీటీఆర్‌ఐ: ‘‘పింఛన్‌ వస్తే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుంది.. జీవితం గాడిన పడుతుంది. రెండేళ్లుగా ఎలాగూ కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. ఇప్పుడేమో అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకోలేకపోయాం. మరోసారి అవకాశం కల్పించండి బాబూ..’’ అంటూ పలువురు దరఖాస్తుదారులు అధికారులను వేడుకున్నారు. కొత్తగా పింఛన్ల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు.. అవసరమైన ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేలోపే దరఖాస్తుల గడువు ముగిసిపోయిందని చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్‌ తెరిచిన కొద్దిరోజులకే దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయడంతో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. పింఛన్ల కోసం దరఖాస్తులకు వివిధ ధ్రువపత్రాలు అవసరం కావడంతో... వయసు, ఆదాయం, కులం తదితర అర్హతలను నిర్ధారించే పత్రాల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ధ్రువపత్రాలు చేతికి రావడంలో జాప్యం చోటుచేసుకోవడంతో గడువు ముగిసింది. అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

కిక్కిరిసిపోయేలా..

కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో బాధితులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బొమ్మూరులోని కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, తమ అర్జీలను పరిశీలించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, వారి కుటుంబ సభ్యులతో కలెక్టరేట్‌ కిటకిటలాడింది. అర్హుల కోసం పోర్టల్‌ను మరోసారి తెరవాలని వారు కోరారు. లేకపోతే కలెక్టరేట్‌లో నేరుగా అర్జీలు స్వీకరించి అర్హతను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

జగన్‌ పాలనలో సువర్ణాధ్యాయం

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేసిన 2019 నుంచి 2024 మధ్య కాలంలో పింఛన్ల కోసం అర్హులంతా నిత్యం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పింఛన్లు మంజూరు చేసి, దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలను సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచేవారు. అప్పట్లో పూర్తి పారదర్శకంగా పింఛన్ల ప్రక్రియ కొనసాగింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పాత విధానానికి స్వస్తి చెప్పేశారు. రెండేళ్ల రెండు నెలల్లో కొత్తగా ఒక్క పింఛనూ మంజూరు చేయలేదంటే పేదల పట్ల పాలకుల వైఖరిని అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడంతో ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పింఛన్ల డ్రామాకు తెరలేపారు. ఈ నెల 7న ఆన్‌లైన్‌ పోర్టల్‌ తెరిచి 9 రోజుల్లో పనిచేసేలా చూసి 18న మూసేశారు. ఎవరైనా ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుని తీసుకోవాలంటేనే కనీసం 21 రోజులు పడుతుంది. అలాంటిది 9 రోజుల్లోనే ప్రక్రియ ముగించేయడంతో వేలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.

పింఛన్ల అర్జీలు

లేవంట!

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ ద్వారా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి 320 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘా స్వరూప్‌, ఇతర అధికారులు అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 144, పంచాయతీరాజ్‌ – గ్రామీణాభివృద్ధి 64, మిగిలిన ఇతర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అయితే వందలాది మంది పింఛన్ల కోసం దరఖాస్తులు పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చినా వారి దరఖాస్తులను పీజీఆర్‌ఎస్‌ అర్జీల్లో చూపించకపోవడం గమనార్హం. దీంతో వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారో.. లేదో అర్థం కావడం లేదు.

అర్హత లేదని తిరస్కరించారు

నేను అంగన్‌వాడీ సహాయకురాలిగా పనిచేస్తున్నాను. నాకు రూ.7 వేల వేతనం. నేను వితంతువుని. ఆ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే నేను ప్రభుత్వ ఉద్యోగినని ఆన్‌లైన్‌లో చూపిస్తుందంటున్నారు. అంతేకాకుండా జీతం తీసుకున్న వారికి పింఛన్‌ వర్తించదంటున్నారు. నా జీతం ఇంటి అద్దెలకు, ఖర్చులకు సరిపోవడం లేదు. నాకు పింఛన్‌ మంజూరు చేయాలి.

– బాతు సత్యవవతి,

అంగన్‌వాడీ సహాయకురాలు

24 నెలలు నిరీక్షణ..

9 రోజులే దరఖాస్తులకు గడువు

ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఇలా తెరిచి...

అలా మూసేశారు

ధ్రువపత్రాలు చేతికొచ్చేసరికి

దరఖాస్తులకు దూరమైన అర్హులు

మరో అవకాశం కల్పించాలని

కలెక్టరేట్‌ వద్ద క్యూ

మేం ఎలా బతికేది

నా భార్య అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. తనకి వచ్చేది నెలకు కొద్దిపాటి వేతనమే. మా ఇంట్లో ఉన్న వృద్ధులకు పింఛను రాకుండా తనని ‘గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌’ అని పోర్టల్‌లో చూపిస్తే మేం ఏం చేయాలి? తన అరకొర జీతంతో వాళ్ల మందులు కూడా కొనలేకపోతున్నాం. 65 ఏళ్లు, 70 ఏళ్లు దాటినా పింఛన్లు మంజూరు చేయకపోతే మేం ఎలా బతికేది. అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలి.

– మొగసాటి రాఘవరాజు, బిక్కవోలు

మరో అవకాశమివ్వాలి

ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి, గౌరవ వేతనం తీసుకునే స్కీమ్‌ వర్కర్లను సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీ నుంచి మినహాయించాలి. సచివాలయ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చూసి వెంటనే అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు పునరుద్ధరించాలి. అర్హులంతా దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్‌ను మరోసారి తెరవాలి.

– బేబీరాణి, అంగన్‌వాడీల సంఘ జిల్లా కార్యదర్శి

అర్హులకు న్యాయం చేయాలి

మా ఇంట్లో అర్హత కలిగిన వారికి పింఛన్‌ మంజూరు కావడం లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇదే పరిస్థితి. పనులు చేసుకోలేని స్థితిలో ఉన్న నాకు పింఛన్‌ ఇవ్వకపోవడం దారుణం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే కాలేదు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి.

– దుంగ నరసింహమూర్తి,

నందరాడ, రాజానగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement