● చంద్రబాబు ప్రభుత్వంలో గడ్డు పరిస్థితులు
● ధరలు తగ్గించే వరకు
ప్రజల పక్షాన పోరాటం
● జగనన్న ప్రభుత్వంలోనే రాష్ట్రం సుభిక్షం
● మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
రాజమహేంద్రవరం సిటీ: ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు గద్దెనెక్కారని, ఈ రెండున్నరేళ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలకు అదుపు లేకుండా చేశారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్ కోటగుమ్మం సెంటర్‌లో పెరిగిన నిత్యావసర ధరలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూనె, గ్యాస్, బియ్యం, ఉల్లిపాయలు, కూరగాయలు, కరెంటు బిల్లులు ఇలా అన్నింటి ధరలను అమాంతం పెంచేసి సామాన్యులను అడ్డంగా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులతో కలసి కూరగాయలు, ఉల్లిపాయల దండలను మెడలో వేసుకుని, గ్యాస్ సిలిండర్లను భుజంపై మోస్తూ.. పెరిగిన వస్తువులను బండిపై పెట్టి తోసుకుంటూ మెయిన్ రోడ్ మీదుగా ప్రదర్శన నిర్వహించారు. జగనన్న ప్రభుత్వంలో ధరలకు, చంద్రబాబు ప్రభుత్వంలో ధరలకు వ్యత్యాసాన్ని చూపుతూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సుభిక్షం.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దుర్భిక్షంతో ప్రజలు కష్టపడుతున్నారంటూ నినాదాలు చేశారు.
పస్తులుండే రోజులు తెచ్చి...
గత ప్రభుత్వంలో బియ్యం బస్తా రూ.1,200 ఉంటే ఇప్పుడు రూ.1,800 ఉండడంతో పస్తులుండే రోజులు తెచ్చారని భరత్‌రామ్ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రూపొందించిన మేనిఫెస్టోని కూడా పట్టుకోవడానికి ఆనాటి బీజేపీ నాయకులు నిరాకరించారని, ఇప్పుడు ఇంత దారుణంగా ధరలు పెంచి దోచేస్తుంటే ఏ విధంగా మంచి ప్రభుత్వమని చెప్పుకొంటున్నారని నిలదీశారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు తగ్గించే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటేయాలో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. త్వరలో జరిగే రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిల్చోమంటే నిల్చుంటారని.. కూర్చోమంటే కూర్చుంటారని, అదే వైఎస్సార్ సీపీ అభ్యర్థి కార్పొరేటర్ అయితే కార్పొరేషన్‌లో అధికారులను నిలదీసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. ఈ రెండున్నరేళ్లు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తామని, కూటమి ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గించేలా చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల తరఫున నిలబడి పెరిగిన ధరలపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, రావిపాటి రామచంద్రరావు, గుర్రం గౌతమ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ వివిధ విభాగాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


