● జాతీయ స్థాయి సైన్స్ ఫెస్ట్‌లో
రంగంపేట విద్యార్థుల ప్రతిభ
● ‘జీరో వేస్ట్ వెల్‌నెస్’ ప్రాజెక్టుకు
ప్రథమ బహుమతి
రంగంపేట: జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో అందరిలోనూ ప్రత్యేకత చాటారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభతో శెభాష్ అనిపించుకున్నారు. బెంగళూరులోని యూనివర్సల్ గ్రీన్ స్కూల్ వేదికగా యూనివర్సల్ గ్రూప్స్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించిన ఆవిష్కార నేషనల్ సైన్స్ ఫెస్ట్–2026లో వారు ప్రథమ బహుమతిని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా 140 పాఠశాలలకు చెందిన 350కు పైగా సైన్స్ ప్రాజెక్టులు ఈ పోటీల్లో ప్రదర్శించగా.. వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు 12 కన్సోలేషన్ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఇందులో రంగంపేట హైస్కూల్‌కు చెందిన ఎనిమిది మంది 9వ తరగతి విద్యార్థినులు నాలుగు ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ప్రత్యేకంగా నిలిచి..
విద్యార్థినులు టి.జ్ఞానవీరలక్ష్మి, జి.యామిని రూపొందించిన ‘జీరో వేస్ట్ వెల్‌నెస్’ ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. వ్యర్థాల నిర్వహణ, వాటి పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే అంశాలను ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీనికి నిర్వాహకులు ప్రథమ బహుమతి అందించారు. అదేవిధంగా సీహెచ్ మాలతీలత, ఆర్.దుర్గ రూపొందించిన ‘స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్’ ప్రాజెక్టుకు కన్సోలేషన్ బహుమతి లభించింది. అలాగే రంగంపేట పాఠశాల విద్యార్థుల బృందానికి ఓవరాల్ టీమ్ ప్రథమ బహుమతి కూడా దక్కడం విశేషం.
ఎంతో గర్వకారణం
తమ విద్యార్థులు జాతీయ స్థాయి వేదికపై ప్రతిభ చాటడం ఎంతో గర్వకారణమని ఆ పాఠశాల హెచ్‌ఎం వి.పార్థసారథి అన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విజేత విద్యార్థులు జ్ఞానవీరలక్ష్మి, యామిని, మాలతీలత, దుర్గ, సత్యసంతోషి, లక్ష్య కార్తికేయలను హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు. ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం వహించిన జీవశాస్త్ర ఉపాధ్యాయిని వినుకొండ రమ్యసుధను ప్రత్యేకంగా అభినందించారు.


