బోర్నగూడెం అటవీ ప్రాంతంలోనే పులి | - | Sakshi
Sakshi News home page

బోర్నగూడెం అటవీ ప్రాంతంలోనే పులి

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

రాజవొమ్మంగి: పులి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం పరిసర అటవీప్రాంతంలో ఉన్నట్లు స్థానిక అటవీ అధికారులు ఆదివారం సాయంకాలం వెల్లడించారు. గత కొన్ని నెలలుగా జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న బెంగాల్‌ టైగర్‌ గోదావరి నది దాటి జిల్లాను వీడి వెళ్లినట్లే వెళ్లి తిరిగి జిల్లాకు వచ్చి హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. గంగవరం, ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్‌ల నుంచి బుధవారం రాజవొమ్మంగి అటవీక్షేత్రంలోని పులి అడుగిడిన సంగతి కూడా తెలిసిందే. రాజవొమ్మంగి మండలంలోని అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలో రెండు రోజులు చక్కర్లు కొట్టి వాతంగి ఫారెస్టు సెక్షన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం పులి రాజవొమ్మంగి ఫారెస్టు రేంజ్‌లోనే బోర్నగూడెం అడవుల్లో ఉందని రాజవొమ్మంగి ఎఫ్‌ఆర్వో ఉషారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్నగూడెం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫారెస్టు అధికారులు ట్రాకర్‌ ద్వారా పులి ఎక్కడ ఉన్నది తెలుసుకుంటునే, మరోవైపు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా పులి రాజవొమ్మంగి అటవీక్షేత్రంలోకి వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా ఎక్కడ పశువులను హాని కలిగించలేదు. గతంలో ఇదే తీరులో సంచరించిన పులి అమ్మిరేఖల, కొమరాపురం, జి.శరభవరం తదితర గ్రామాల్లో అనేక ఆవుదూడలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతానికి తమ పశువులకు ఎటువంటి ప్రాణహాని జరగకపోయినా నాలుగు రోజులుగా ఆకలితో ఉన్న పులి ఎటునుంచి అయినా వచ్చి తమ పశువులను చంపేస్తుందేమోనన్న ఆందోళనలో గిరిజన రైతులు వున్నారు. ఫారెస్టు అధికారులు తగిన చర్యలు తీసుకుని తమను, తమ పాడి పశువులను కాపాడాలని కోరుతున్నారు. పులిని సాధ్యమైనంత త్వరగా సురక్షితమైన అడవులకు పంపించాలని గిరిజన ప్రతినిధులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement