చింతూరు: మండలంలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు. చింతూరు శబరినది వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్, స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న ఏజీ కొడేరుకు చెందిన సున్నం ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్కూటీపై భద్రాచలం నుంచి ఒడిశా వెళ్తున్న దంపతుల్లో భర్త గౌరవ్‌మండల్‌కు తీవ్రగాయాలు కాగా భార్య ఆసిబా బిశ్వాస్‌కు రెండేళ్ల ధిర్తి మండల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి ధిర్తి బలంగా రహదారిపై పడుతున్న సమయంలో తల్లి ఆసిబా సమయస్ఫూర్తితో చెయ్యి అడ్డుపెట్టడంతో ఆమె సురక్షితంగా బైటపడింది. తీవ్రంగా గాయపడిన గౌరవ్‌మండల్, ప్రసాద్‌లను భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేశారు. సరివెల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారి–30పై జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పద్దం మల్లయ్య, తెలంగాణకు చెందిన గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి చింతూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం భద్రాచలం తరలించారు.


