బోటక్లబ్: సాధిక్ ఖాన్ అకృత్యాల వల్ల ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంలో బతికి బయటపడిన ఆయన మనవడు రేయాన్ష్ కార్తికేయరెడ్డిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆ దుర్ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన చిన్నారికి ప్రభుత్వ తగిన రక్షణ కల్పించాలన్నారు. పదేళ్ల వయసులో ఆ చిన్నారికి తల్లిదండ్రులు దూరమైన నేపథ్యంలో వారి కుటుంబ ఆస్తులు అక్రమార్కుల చేతికి చిక్కకుండా కాపాడాలని ఆయన కోరారు. అతడి మేనమామ యాక్సిడెంట్‌లో మరణించటం, తండ్రి తరఫు తాతా నానమ్మలు వృద్ధులు కావడంతో అతడికి ప్రభుత్వం గార్డియన్‌గా వ్యవహరించాలని కోరారు. సాధిక్ ఖాన్ వెనుక ఒక ముఠా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిసరాల్లో ఉన్నట్లు కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలపైనా లోతైన విచారణ చేయాలని కోరారు. సాధిక్ ఖాన్ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు చోడిశెట్టి రమేష్‌బాబు, దువ్వూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


