సామర్లకోట: పంచారామ క్షేత్రంలో కొన్నేళ్లుగా శ్రావణ శుక్రవారాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం, సెప్టెంబరు 4వ తేదీలలో సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేసినట్టు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఈ వ్రతాల్లో పాల్గొనే భక్తులు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆలయానికి చేరుకోవాలని కోరారు. ఆలయంలోని నంది మండపం వద్ద సామూహిక వ్రతాలలో పాల్గొనే వారికి దాతలు, దేవస్థానం తరఫున ప్లేట్లు, కొబ్బరి కాయ, అరటి పండ్లు, పువ్వులు, ఆకులు, చెక్కలు, అమ్మవారి ఫొటో అందజేయనున్నట్టు తెలిపారు. వాటిని తీసుకుని భక్తులు మొదటి అంతస్తులో కూర్చోవలసి ఉంటుందన్నారు. మొదటి అంతస్తు నిండితే దిగువ ప్రాకారంలో భక్తులకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పూజ ప్రారంభమయ్యే ముందు నూనె, ప్రసాదం, గాజులు, వరలక్ష్మీ రూపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. పూజా కార్యక్రమం ప్రారంభమైన తరువాత పూజా సామగ్రి అందే అవకాశం ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆలయానికి చేరుకోవాలని సూచించారు. ఆలయ మొదటి అంతస్తుతో పాటు దిగువ భాగంలో ఉన్న భక్తులకు అర్చకులు తెలియజేసే పూజా విధానం అందరికీ వినిపించేలా మైక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వ్రతాల్లో పాల్గొనే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రొయ్యల మేత లారీ బోల్తా
సామర్లకోట: స్థానిక కాకినాడ రోడ్డులో వీకే రాయపురం సమీపంలో బుధవారం రొయ్యల మేత లోడు లారీ బోల్తా పడింది. పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రైస్‌మిల్లు నుంచి రాజోలు వెళ్తున్న లారీ తెల్లవారు జామున కురిసిన వర్షానికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో సామర్లకోట–కాకినాడ రోడ్డు సింగిల్ రోడ్డు కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు ఆధ్వర్యంలో లారీని క్రేన్ సాయంతో తొలగించి లోడును రోడ్డు మార్జిన్‌లోకి చేర్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి
కాకినాడ క్రైం: విధి నిర్వహణలో విద్యుదాఘాతానికి గురై ఓ లైన్‌మన్ మృతి చెందాడు. కాజులూరు మండలం చాకిరేవుమెరకకు చెందిన కొప్పిశెట్టి ప్రసాద్ (32) రామారావుపేటలో ఉన్న సెక్షన్ డి–1లో జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం స్థానిక ల్యాండ్ మార్క్ షోరూం నుంచి కార్యాలయానికి విద్యుత్ అంతరాయంపై ఓ ఫిర్యాదు అందింది. దీంతో ప్రసాద్ వెళ్లాడు. మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. తీగలు పరిశీలిస్తుండగా, విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరణానికి కారణాలను పరిశీలిస్తున్నామని, విద్యుత్ సరఫరా నిలిపిన తర్వాతే స్తంభం ఎక్కినా ప్రమాదం వాటిల్లిందని శాఖ అధికారులు అంటున్నారు. శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చామన్నారు. ల్యాండ్‌మార్క్ వ్యాపార సంస్థ ట్రాన్స్‌ఫార్మర్‌ను సిమెంట్ దిమ్మపై పెట్టకుండా నేలపై ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు వాపోయారు. ప్రసాద్‌కు వివాహం కాగా ఆరేళ్ల కుమార్తె ఉంది. ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


