● తోబుట్టువుల అనురాగాలకు సూచిక
● కిటకిటలాడుతున్న
రాఖీ, స్వీట్ దుకాణాలు
● రేపు రాఖీ పండుగ
రాయవరం: రాఖీ పౌర్ణమి ఉత్సవానికి ఇటు తోబుట్టువులు.. వరసైన అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు సిద్ధమయ్యారు. శుక్రవారం రాఖీ పండగకు అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ముల అభిరుచికి తగ్గట్టుగా రాఖీల ఎంపికలో తలమునకలైతే.. వెల కట్టలేని తమ అనురాగాన్ని ఏమిచ్చి తూచగలమన్న భావనతో తమ అక్కాచెల్లెళ్లకు ఏమిచ్చి వారి ముఖారవిందాల్లో చిరునవ్వులు.. ఆనంద బాష్పాలు చూడాలా అని అన్నదమ్ములు ఆతృత పడుతున్నారు.
మహాలక్ష్మీ స్వరూపంగా..
ఇంటి ఆడ పడుచును మహాలక్ష్మీ స్వరూపంగా భావించే భారత సంస్కృతిలో సుఖ సంతోషాల్లోనే కాకుండా కష్ట నష్టాల్లోనూ నేనున్నానని తోడుండే అన్నదమ్ములు రక్షణగా నిలిచే బంధమే రక్షా బంధన్.
జంధ్యాల పౌర్ణమిగా
శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పర్వదినాన్ని జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తుంటారు. తమిళనాడులో పూనూల్‌పర్వగా, కేరళలో ఆవని ఆవిట్టంగా పిలుస్తుంటారు. ఉత్తరాదిలో రక్షాబంధన్‌గా ఈ రోజును పిలవడం పరిపాటి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం (ఓం శాంతి) ప్రతినిధులు రాఖీ పండుగను ఆధ్యాత్మిక విశిష్టత గలదిగా భావిస్తారు. తమ కార్యాలయాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులకు కూడా పండుగ రోజు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది.
మార్కెట్‌కు రాఖీల కళ
మార్కెట్లలో వివిధ వర్ణాల.. డిజైన్లలో రాఖీలు సందడి చేస్తున్నాయి. సాధారణ రంగురంగుల దారాలకు ఏదో చిన్న పెండెంట్ వంటిది ముడి వేసినది మొదలు బంగారంతో తయారు చేసిన రాఖీల వరకు విక్రయానికి సిద్ధమయ్యాయి. ఫ్యాన్సీ దుకాణాలు మొదలుకొని బంగారం దుకాణాల వరకు వీటి విక్రయాలకు సమాయత్తమయ్యాయి. బ్రాస్‌లెట్లను తలపించేవి కొన్ని.. వెండి లాకెట్లతో, రుద్రాక్షలతో, ప్లాస్టిక్ పూలతో విక్రయిస్తున్నారు. అదే సమయంలో స్వీట్ దుకాణాలు, అనుబంధ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
●
కష్ట సుఖాల్లో తోడుండే సోదరుడు
నాకు అన్నదమ్ములు లేరు. ఏటా మా కజిన్స్‌కు రాఖీ కడతాను. కష్టసుఖాల్లో తోడు నిలిచి, మన శ్రేయస్సు కోరుకునే వారే సోదరులు. రాఖీ పండుగ వస్తోందంటే వారే నాకు రాఖీ కట్టడానికి ఆతృతపడుతుంటారు. ఎంత దూరాన ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కట్టి ఆశీర్వదించి వెళ్తారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటాను.
– పందిరి శ్రావ్య, ఇంజినీరింగ్ విద్యార్థి,
పెద్దాడ, పెదపూడి మండలం
అన్నంటే ప్రాణం
ఏటా మా అన్నకు రాఖీ కడతాను. ఎంత దూరాన ఉన్నా నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్తాడు. అన్ని పండగల్లో అన్నాచెల్లెల గురించి తెలియజేసే పండుగ ఇదే. ఎంత వయసు వచ్చినా అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఏదీ సాటిరాదు.
– పంపన నాగ మల్లీశ్వరి,
ఏడిద సావరం, మండపేట మండలం
ఆన్‌లైన్ రక్షాబంధన్
కాలం మారడంతో పాటు రక్షా బంధన్ తీరు కూడా మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే వాటిని కట్టుకుని తోబుట్టువులకు కానుకలు పంపే సంప్రదాయం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకునే వెసులుబాటూ నేడు అందుబాటులో ఉంది. ప్రేమాప్యాయతలు పంచుకునే తీరు మారినా సంప్రదాయం మాత్ర చెక్కు చెదరకుండా కలకాలం సాగుతోంది.


