త్రివర్ణ శోభితం.. | - | Sakshi
Sakshi News home page

త్రివర్ణ శోభితం..

Aug 16 2026 12:27 AM | Updated on Aug 16 2026 12:27 AM

సాక్షి, రాజమహేంద్రవరం: మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. బానిస సంకెళ్లు తెంచుకుని సగర్వంగా ఎగిరింది.. దేశానికి స్వేచ్ఛా వాయువులను తీసుకొచ్చిన త్యాగధనుల స్మరణ దేశభక్తిని నింపింది.. జనగణమన గీతం అందరి నోటా ప్రతిధ్వనించింది.. భారతావని కీర్తి ఎగసింది.. జిల్లా స్థాయిలో నిర్వహించిన జెండా పండగకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానం వేదికై ంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్‌, వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని అన్నారు. పల్లె పండుగ 2.0 కింద రూ.262 కోట్లతో 655 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి పనులు చేపట్టామని, జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రూ. 128 కోట్లతో 66,744 గృహాలకు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశామని వివరించారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా 2.89 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి రూ. 92.30 కోట్ల లబ్ధి పొందారని తెలిపారు.

అలరించిన శకటాలు

స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా పోలీస్‌, ఎన్‌సీపీ దళాలు నిర్వహించిన సంప్రదాయ కవాతు అలరించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయ, డీఆర్‌డీఏ, విద్య, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, ఏపీ ఈపీడీసీఎల్‌, పంచాయతీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అగ్నిమాపక శాఖలు శకటాలను ప్రదర్శించాయి. ఇందులో ఏపీ ఈపీడీసీఎల్‌ శకటం మొదటి బహుమతి, వైద్య ఆరోగ్యశాఖ శకటం రెండో బహుమతి, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ శకటం మూడో బహుమతి గెల్చుకున్నాయి.

దేశభక్తిని నింపేలా..

పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తిని నింపేలా సాగాయి. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రదర్శన మొదటి బహుమతి, గిరిజన ఆశ్రమ పాఠశాల (బొమ్మూరు) విద్యార్థుల ప్రదర్శన రెండో బహుమతి, గౌతమి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థుల ప్రదర్శన మూడో బహుమతిని గెలుచుకున్నాయి.

ఆకట్టుకున్న స్టాల్స్‌

● స్వాతంత్య్ర దిన వేడుకల ప్రాంగణంలో మత్స్యశాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సర్వే, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, సహకార శాఖలు, డీఆర్‌డీఏ, మెప్మా, చేనేత జౌళి, గిరిజన సంక్షేమం, ఐసీడీఎస్‌, హార్టికల్చర్‌, వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి.

● వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా విశిష్ట సేవలందించిన 561 మంది అధికారులు, సిబ్బందికి మంత్రి కందుల దుర్గేష్‌, కలెక్టర్‌ కీర్తి చేకూరి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ నరసింహ కిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా, డీఆర్వో భాస్కరరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ దేవరాజ్‌ పాటిల్‌ పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో..

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలన్నారు.

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో

స్వాతంత్య్ర దిన వేడుకలు

ఆకట్టుకున్న శకటాలు,

సాంస్కృతిక ప్రదర్శనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement