అన్నవరం: రత్నగిరి వాసా.. చిద్విలాసా అంటూ ఆ సత్యనారాయణ స్వామివారిని భక్తులు కొలిచారు. అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణమాసం సందర్భంగా తిరిగి వివాహాలు ప్రారంభం కావడంతో వధూవరులు, వివాహ బృందాలతో రద్దీగా మారింది. సుమారు 50 వేల మంది భక్తులు రాగా, రూ.200 టిక్కెట్‌తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులను వెలిగించి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
శృంగారవల్లభ స్వామి
ఆలయంలో ప్రత్యేక పూజలు
సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారిని, ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,84,440, అన్నదాన విరాళాలుగా రూ.45,663, కేశ ఖండన ద్వారా రూ.6,400, తులాభారాలతో రూ.550, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,400 కలిపి మొత్తం రూ.2.57,453 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఆలయంలో నాలుగు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. మాజీ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.
మాజీ ఎమ్మెల్యే వెంకట్రావుకు
పరామర్శ
రాజమహేంద్రవరం సిటీ: ప్రమాదవశాత్తూ గాయాలపాలై దివాన్‌చెరువులోని విజయభారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్‌లో రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావును శనివారం పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, సుంకర రాయుడు, సత్యనారాయణ, చిట్టూరి అన్నవరం తదితరులు ఉన్నారు.


