● క్షీణించిన శాంతిభద్రతలు
● కుప్పకూలిన వ్యవస్థలు
● కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన
వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు చెల్లుబోయిన
● నిందితులను కఠినంగా
శిక్షిస్తేనే ప్రియాంక ఆత్మకు శాంతి
● నినదించిన పార్టీ మాజీ ఎంపీలు,
మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
● ప్రసాదిత్య మాల్ వద్ద
వైద్యురాలి సంతాప సభ
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ప్రియాంక దారుణ హత్యోదంతమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం డాక్టర్ ప్రియాంక సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆమె చిత్ర పటానికి పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణితో కలసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ మద్యం మత్తులోనే ప్రియాంకకు ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థం కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ధ్వజమెత్తారు. నిందితులు గంజాయి తాగారా.. మద్యం తాగారా అన్నది ఎవరు నిర్ధారించారని ప్రశ్నించారు. మద్యం వల్లే నిందితులు దుర్మర్గానికి పాల్పడితే అందుకు చంద్రబాబుదే బాధ్యత అని వేణు అన్నార. సోషల్ మీడియా కట్టడికి కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారని, అదే సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం కిరాతకుల దుశ్చర్య వెలుగులోకి వచ్చిందన్నారు.
శాంతిభద్రతలు విఫలం
రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కొడుకు బూడిదైనా ఇవ్వండని ఓ తల్లి వేడుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసులను ఉపయోగిస్తున్నారన్నారు. ప్రియాంక కేసును పోలీసులు, టీడీపీ నాయకులు చిన్న ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారన్నారు.
హోం మంత్రి స్పందించకపోవడం దారుణం
డాక్టర్ ప్రియాంక మరణంపై హోం మంత్రి అనిత స్పందించకపోవడం దారుణమని మాజీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ బిల్లును రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
నేరగాళ్లకు నగర బహిష్కరణ చేయాలి
ప్రియాంక ఘటన మరువక ముందే రోజుల వ్యవధిలో నగరంలో మూడు హత్యలు జరిగాయని.. అసలు పోలీసు వ్యవస్థ ఉందో లేదో తెలియడం లేదని మాజీ ఎంపీ భరత్‌రామ్ అన్నారు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిని నగర బహిష్కరణ చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ద్వారా తాము పోరాటం చేయడంతో ప్రియాంక హంతకులకు బెయిల్ రాకుండా సెక్షన్లు మార్చారని తెలిపారు.
ఉద్యోగం అడుగుతుంటే మద్యం పోస్తున్నారు
చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్యోగాలు అడుగుతున్న నిరుద్యోగులకు మద్యం పోయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం సామాన్యులకు శాపంగా మారిందన్నారు. ప్రియాంక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు పోలీసులను మేనేజ్ చేశారన్నారు.
మెరిట్ విద్యార్థినిని కోల్పోయాం
మెరిట్ స్టూడెంట్ ప్రియాంకను కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మద్యం, గంజాయి విక్రయాలను నియంత్రించాలని కోరారు.
నగరానికి మాయని మచ్చ
డాక్టర్ ప్రియాంక ఘటన రాజమహేంద్రవరం చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు.
‘దిశ’ వర్తింపజేస్తే..
ప్రియాంక కేసుకు ‘దిశ’ను వర్తింపజేస్తే 21 రోజుల్లోనే ట్రయల్‌కు వచ్చేదని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరు శ్రీనివాస్ అన్నారు.
ఆడ పిల్లలను బయటకు
పంపాలంటే భయమేస్తోంది
మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో ప్రియాంక మృతితో తెలిసిపోయిందన్నారు.
పవన్ నేటికీ
నోరు విప్పలేదు
మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ సుగాలి ప్రీతి విషయంలో, ఓ మహిళ మేకప్ విషయంలో స్పందించిన వారు ప్రియాంక హత్యపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టమే తీసుకు వస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటికీ నోరు విప్పడం లేదన్నారు. ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయపడే పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
మద్యం ఆదాయంతో ప్రభుత్వం నడుస్తోంది
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టపగలే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయన్నారు. మద్యం మాఫియా, తద్వారా వచ్చే ఆదాయంతో చంద్రబాబు ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఆచంట అనసూయ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, గిరజాల బాబు, నక్కా శ్రీ నగేష్, రామకృష్ణ, నేతలు గుర్రం గౌతమ్, కోడి ప్రవీణ్, కానుబోయిన సాగర్, తగరం సోము, ఆరే చిన్ని, దాట్ల పృథ్వీ, హసీనా బేగం, హసన్, కాటం రజనీకాంత్, గారా చంటిబాబు, దాసి వెంకటరావు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మాసా రామజోగ్, ఎండీ ఆరిఫ్, పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


