సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వం దగాపై అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, మిడ్డే మీల్ కార్మికులు, వెలుగు ఓఏలు నిరసన గళం ఎత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేల మంది స్కీం వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు చేరుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, స్కీం వర్కర్ల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం డీఆర్‌ఓ కలెక్టరేట్ నుంచి వెలుపలికి వచ్చి, సంఘాల నాయకత్వం సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, యాప్‌ల పనిభారం తగ్గించాలని, హెల్పర్లను ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
జిల్లాలో ఏడు వేల మంది
జిల్లాలో సుమారు 7 వేల మంది స్కీం వర్కర్లు ఉన్నారు. వీరందరూ చంద్రబాబు మాటలను నమ్మి ఎన్నికల సమయంలో ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆయన హామీలను మర్చిపోయారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో కడుపు మండిన స్కీం వర్కర్లు చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరిసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్ బాబు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం జిల్లా నాయకురాలు చిట్టా బేబీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.26 వేల వేతనం ఇవ్వాలి
పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని మా వేతనాన్ని రూ.26 వేలు చేయాలి. ఎన్నికల ముందు చంద్రబాబు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అంగన్ వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్నినిలుపుదల చేయాలి.
– బేబీ రాణి, కార్యదర్శి
మా జీవితాల్లో వెలుగు లేదు
గ్రామీణ మహిళలను ఆర్థికంగా, మానసికంగా బలోపేతం చేస్తూ పారిశ్రామిక వేత్తలుగా, లక్షాధికారులుగా చేసి వారి జీవితాలలో వెలుగు నింపుతున్నాం. కానీ మా జీవితాలలో వెలుగు ఉండటం లేదు. 20 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుని నమ్ముకుని బతుకుతున్నాం. మాకు రూ.26 వేల వేతనం ఇస్తే బాగుంటుంది.
– స్వరూపరాణి,
ఏపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు
ఫ కదం తొక్కిన స్కీం వర్కర్లు
ఫ కనీస వేతనం
రూ.26 వేలకు పెంచాలని డిమాండ్
ఫ కలెక్టరేట్ వద్ద ధర్నా
అన్నింటినీ ఓకే యాప్‌గా చేయాలి
రోజుంతా యాప్‌లతోనే సరిపోతోంది. ఒక్కోసారి నెట్‌వర్క్ పనిచేయకపోవడం, సర్వర్ బీజీగా ఉండటంతో ఆ రోజు పనిని మరుసటి రోజు చేయాల్సి వస్తోంది. అన్ని యాప్‌లను కలిపి ఒక్కటిగా చేస్తే పనిభారం తగ్గుతుంది.
– మాణిక్యాంబ, అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు


