కపిలేశ్వరపురం (మండపేట): కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, దూలం వెంకన్న బాబు, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాపుల రిజర్వేషన్లను ఎత్తివేశారంటూ టీడీపీ నాయకులు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తోట ఖండించారు. వారి చేస్తున్న ఆరోపణ నిజమై ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన 26 నెలలుగా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకుండా దిక్కులు చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఐదు శాతం రిజర్వేషన్లును మంజునాథ్ కమిషన్ సిఫారసు చేసిందని, అయితే అప్పటి ప్రభుత్వం ఆ సిఫారసును అమలు చేయలేకపోయిందన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో కాపులకు బీసీ కోటా, కేంద్ర ప్రభుత్వ ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు అమలవుతున్నాయా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ కుల రాజకీయాల పేరిట రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తుందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళం వరకూ జనం బ్రహ్మరథం పట్టారన్నారు. ఆ ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ శ్రేణులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ 2016లో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంగా పద్మనాభం కుటుంబ సభ్యులను తీవ్రంగా అవమానించినది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. ముద్రగడ మృతి చెందిన నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేయడాన్ని ఆపాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ తోట హితవు పలికారు. సమావేశంలో నాయకులు పలివెల సుధాకర్, సూరంపూడి సత్య ప్రసాద్, పిల్లా వీరబాబు, పిల్లి శ్రీనివాస్, ముక్కా దాళియ్య, వాసిరెడ్డి అర్జున్, శెట్టి నాగేశ్వరరావు, సాధనాల శివ భగవాన్, పోతంశెట్టి ప్రసాద్, మెండు బాపిరాజు, మట్టపర్తి గోవిందరాజు పాల్గొన్నారు.
ఫ కాపు రిజర్వేషన్లపై దుష్ప్రచారం
ఫ ఆ పార్టీకి ప్రజలు తగిన
గుణపాఠం చెబుతారు
ఫ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు


