ఆలమూరు: చొప్పెల్లలోని తూర్పు డెల్టా ప్రధాన కాలువలో పడి ఓ మహిళ మృతి చెందింది. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన నున్న శ్రీనివాస్, వెంకటలక్ష్మి (45) దంపతులు. వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళుతున్నారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి వెంకటలక్ష్మికి కళ్లు తిరుగుతుండటంతో పక్కనే కాలువ రేవులో దిగి చల్లని నీటితో శ్రీనివాస్ సపర్యలు చేశారు. అంతలో వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడిపోవడంతో శ్రీనివాస్ ఆమెను రక్షించేందుకు కాలువలోకి దూకాడు. భార్యభర్తలిద్దరూ కాలువలో కొట్టుకుపోతుండడాన్ని గమనించిన స్థానికులు ఇద్దరిని రక్షించి మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తపేట సామాజిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంకటలక్ష్మి మృతి చెంచింది. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేయగా, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ దర్యాప్తు చేస్తున్నారు. చొప్పెల్ల తూర్పు డెల్టా ప్రధాన కాలువలో పడి వెంకటలక్ష్మి మృతి చెందడం మిస్టరీగా మారింది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


