మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రశ్న
రాజమహేంద్రవరం సిటీ: ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు కావాల్సిన వారికి ధారాదత్తం చేస్తున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం రాజమహేంద్రవరంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. హర్షకుమార్ మాట్లాడుతూ పతాంజలి ఉత్పత్తులపై ఆరోపణలు ఎదుర్కొని, సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్‌ను రాష్ట్రానికి పిలిచి యోగా డే రోజున విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామం వద్ద 70 ఎకరాల భూమిని, రూ.130 కోట్లు రాయితీగా ప్రభుత్వ ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సిటీ అయిన న్యూయార్క్ సిటీలో డేటా సెంటర్లను నిషేధించారని తెలిపారు. అలాంటిది రాష్ట్రంలో డేటా సెంటర్లకు భూములు, విద్యుత్ రాయితీల రూపంలో నగదు ముందుగానే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్‌పరం చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వల్ల పేదలకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉన్న సంపదను అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. కాపు సామాజిక వర్గం సంక్షేమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన రక్తాన్ని ధారపోశారని నివాళులర్పించారు. వచ్చే నెల 10న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


