సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అనిశెట్టి రామకృష్ణను రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ బలోపేతానికి, గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
అమలాపురం టౌన్: విజయవాడలో ఈ నెల 11, 12 తేదీల్లో అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అమలాపురానికి చెందిన మాస్టర్స్ పవర్ లిఫ్టర్ చీకురుమిల్లి కిరణ్‌కుమార్ 74 కిలోల విభాగంలో మొదటి స్థానంతో బంగారు పతకాన్ని సాధించారు. అతన్ని అమలాపురం కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే ఐపీఎస్ పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఆ అసోసియేషన్ భవనం వద్ద గురువారం సత్కరించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో కిరణ్‌కుమార్‌కు ఈ సత్కారం జరిగింది. క్రీడాకారుడు కిరణ్‌కుమార్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం అమలాపురానికే గర్వ కారణమని ఎమ్మెల్సీ అన్నారు. కిరణ్‌కుమార్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని న్యాయవాదులు కుడుపూడి త్రినాథ్, పితాని చిన్న, రిజర్వుడ్ ఏఎస్సై బొక్కా త్రినాథరావు, జగదీశ్వరరావు, చిరంజీవి తదితరులు ఆకాంక్షించారు.
పుష్కర ఘాట్‌లో
వ్యక్తి మృతదేహం లభ్యం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో గురువారం ఉదయం ఓ వ్యక్తి (50) మృతదేహం లభించిందని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి.అప్పారావు తెలిపారు. మృతుడి ఒంటిపై నలుపు, నీలం రంగు చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 94407 96532, 90954 28255 ఫోన్ నంబరులకు తెలపాలని అప్పారావు కోరారు.
కారు ఢీకొని మహిళ మృతి
గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. తాపేశ్వరానికి చెందిన భార్యాభర్తలు కర్రి దుర్గారావు, విజయదుర్గ (38) కె.గోపాలపురానికి వచ్చి తిరుగు పయనమయ్యాయి. గండేపల్లి శివారు ఎన్టీ రాజాపురం వెళ్లే మార్గం వద్ద రోడ్డు దాటుతుండగా, విశాఖ వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. ఘటనలో గాయపడిన విజయదుర్గను హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందింది.
రైల్వే గేటు ధ్వంసం
తొండంగి: గోపాలపట్నంలో రైల్వే గేటును ఓ టిప్పర్ ఢీకొంది. సాగర్‌మాల రహదారి నిర్మాణంతో పాటు కోన ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి టిప్పర్లు అన్నవరం నుంచి గోపాలపట్నం మీదుగా తొండంగి మండలంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి టిప్పర్ అన్నవరం వైపు నుంచి తొండంగి వైపు వెళ్తూ రైల్వే గేటును ఢీకొంది. గేటు ధ్వంసమైంది. రైల్వే సిబ్బంది అత్యవసర గేటును ఏర్పాటు చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
శ్రీవారికి స్వర్ణహారం
ద్వారకాతిరుమల: స్థానిక శ్రీవారి అలంకారానికి ఓ భక్తుడు స్వర్ణ హారాన్ని గురువారం సమర్పించాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దాత వి.రవిజైన్ 118 గ్రాముల బంగారు హారాన్ని దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావుకు, ఆలయ అర్చకులకు అందించారు. దీని విలువ సుమారు రూ. 19 లక్షలు ఉంటుందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు.


