ఫ గత డిసెంబర్ 7న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ఫ నేటికీ విడుదల కాని అర్హుల జాబితా
ఫ ఉపకార వేతనాల కోసం
విద్యార్థుల ఎదురుచూపులు
ప్రతిభావంతులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ఓ వరం.. ఏటా కేంద్ర ప్రభుత్వం చదువరులకు ఉపకార వేతనాలు అందించి ప్రోత్సహిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రతి నెలా ఉపకార వేతనం ఇస్తోంది. అయితే ఎన్‌ఎంఎంఎస్ ప్రతిభా పరీక్ష నిర్వహించి ఏడు నెలలు గడుస్తున్నా, అర్హుల జాబితా విడుదలలో మాత్రం జాప్యం
జరుగుతుంది. దీనికోసం పేద విద్యార్థులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.
కొత్తపేట: పేద విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఉపకార వేతనాలు అందించే ఉద్దేశంతో రూపొందించిన పథకమే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్). ఈ ఉపకార వేతనాల కోసం గత ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మే నెల లోపు విడుదల చేసేవారు. గత ఏడాది జూన్ 5న వచ్చాయి. ఈ సంవత్సరం మాత్రం జూలై నెల వచ్చినా ఇంతవరకు ఫలితాలను విడుదల చేయలేదు. ఎన్‌ఎంఎంఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతన పథకం. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని 2008 నుంచి అమలు చేస్తున్నారు. 8వ తరగతి తరువాత డ్రాప్ అవుట్లు తగ్గించి, విద్యను కొనసాగించేలా విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ పథకం రూపొందించారు. ఏడో తరగతిలో 55 శాతం పైగా మార్కులు సాధించి, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 9, 10, ఇంటర్ రెండేళ్లతో మొత్తం నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తారు. ఇలా నాలుగేళ్లకు రూ.48 వేలు స్కాలర్‌షిప్‌గా అందజేస్తారు. ఇలా రాష్ట్రంలో ఏటా సుమారు 4 వేల మంది ఈ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ఏడాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 140 మంది, కాకినాడ జిల్లాలో 136 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 145 మంది ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ గత ఏడాది డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా 382 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తం 77,739 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన 174 మంది విద్యార్థుల ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేయగా, మార్చి 24న జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. ఆ లిస్టులో అత్యధిక మార్కులు, కులం తదితర అంశాలు పరిగణనలోకి తీసుకుని అర్హులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఆ జాబితా విడుదల చేయాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి వచ్చే నెలలో మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం జరిగిన ఈ పరీక్షకు తుది ఫలితాలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొత్తపేట మండలంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్)


