ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతి గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆ క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు ఆలయం వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచి రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవ, తొలి హారతి, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం తదితర పూజలను చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలకరించారు. స్వామివారి అలంకారంగా నూతన బంగారు మకర తోరణం ఆకట్టుకుంది. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. భక్తలు తులాభారాలు నిర్వహించి కానుకలు సమర్పించారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
భక్తజన సంద్రంలా వెంకన్న ఆలయం


