నల్లజర్ల: ఐదు సార్లు సివిల్స్ పరీక్షలలో విఫలమైనా కుంగిపోకుండా ..పట్టుదలతో ప్రయత్నించి ఆరో ప్రయత్నంలో యూపీ ఎస్సీలో ర్యాంకు సాధించారు అనంతపల్లికి చెందిన చెజెర్ల అశ్వినికుమార్. ఆయన 256వ ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన చెజెర్ల కాళేశ్వరరావు, సరోజనిదేవి కుమారుడు అశ్విని కుమార్. చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనంతపల్లిలో మేనమామ మాయకోటి రాజశేఖర్(అస్సాంరాజు)వద్ద పెరిగారు. గుంటూరులో విద్యాభ్యాసం జరిగింది. విజ్ఙాన్‌లో బీటెక్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. 2021లో ఐఈఎస్‌లో తొలుత 29వ ర్యాంకు సాధించారు. తర్వాత 2023లో మళ్లీ రాసి 13వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం అశ్వినికుమార్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ డైరెక్టర్ (సీఈఏ)గా న్యూఢిల్లీలో పనిచేస్తున్నారు. ఫలితాలు వెలువడ్డ తర్వాత శనివారం ఉదయం ఇక్కడి వారితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరైతే తనకు 256వ ర్యాంకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. నాలుగు సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమైనట్టు చెప్పారు. ఆరోసారి సివిల్స్‌కు ఎంపికై న వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో చదివి సఫలీకృతుడైనట్టు చెప్పారు. అనంతపల్లిలోని మేనమామ, బాబాయ్ వలిగడ్ల నాగమల్లికార్జునరావు, విజయలక్ష్మి ఇళ్ల వద్ద టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు.
‘నన్నయ’లో వాకథాన్
రాజానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర మహిళా కమిషనర్ ఫ్లాగ్ షిప్ సహకారంతో ‘హానరింగ్ ది వారియర్ విటిమ్’ అనే థీమ్‌తో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శనివారం వాకథాన్ జరిగింది. ఈ ర్యాలీని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీలో ఎన్ బ్లాక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రధాన గేటు వరకు వెళ్లి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి మహిళా హక్కులు, వాటి పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలపై అవగాహన కలిగిస్తూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం శనివారం తెలిపింది. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్‌లు కలిసి గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నాయని అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, నివాసాలు, లాడ్జీలు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సోదాలు నిర్వహించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 155 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 255 మందిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 70 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. రౌడీ షీట్‌లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
● ఆరవ ప్రయత్నంలో కల సాకారం
● సివిల్స్ ఫలితాలలో 256వ ర్యాంకు సాధించిన అశ్వినికుమార్


