కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి యం.మాధురి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మహిళా సాధికారత, హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం, సమాజంలో మహిళలు పోషించే పాత్ర అత్యంత ముఖ్యమని, నేడు అన్ని రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారన్నారు. అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ఆ వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పురుషులు ముందుకు రావాలన్నారు. మహిళలు, చిన్నారులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టు ప్రాంగణంలో అందుబాటులో ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నప్పటికీ ఇంకా అఘాయిత్యాలు కొనసాగుతున్నాయన్నారు. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ఆడపిల్లలలో ధైర్యం నింపడంతో పాటు మగపిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఎస్‌కేఆర్ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. ఆర్‌ఎంసీ ఎంహెచ్‌వో వి.వినూత్న, న్యాయాధికారులు, న్యాయవాదులు, మహిళలు పాల్గొన్నారు.


