విద్యావ్యాప్తికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యాప్తికి ప్రాధాన్యం

Mar 8 2026 7:47 AM | Updated on Mar 8 2026 7:47 AM

జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా

రాజమహేంద్రవరం రూరల్‌: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సామాజిక, సంక్షేమ రంగాల్లో సమర్థమైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానా అధికారులను ఆదేశించారు. విద్యావ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని అన్నారు. శనివారం స్థానిక ఓఎన్‌జీసీ గోదావరి భవన్‌ సమావేశ మందిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. డ్రాప్‌ అవుట్‌లు లేకుండా ఆయా వర్గాలకు చెందినవారు చదువుకునేలా చైతన్య పరచడం ముఖ్యం అన్నారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్‌, సంక్షేమ పథకాల అమలు, అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.

జాతీయ ఎస్సీ కమిషన్‌ కార్యదర్శి జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గాలకు సంబంధించిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై చొరవ తీసుకోవాలని అధికారులను సూచించారు. కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు భద్రత కల్పించే విషయంలో పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘాస్వరూప్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్‌.డి.గయాజుద్దీన్‌, ఇంచార్జి ఆర్డీవోలు కె.భాస్కర్‌రెడ్డి, ఎంఆర్‌ఆర్‌ ప్రేమ్‌ కుమార్‌, ఉమ్మడి తూర్పుగోదావరి ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జే సత్యవతి పాల్గొన్నారు.

మక్వానాకు స్వల్ప అస్వస్థత

జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానాకు స్వల్ప అస్వస్థత కలగడంతో శనివారం డెల్టా ఆసుపత్రిలో చికిత్స అందించామని కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. అవసరమైన వైద్య సేవలు అందించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement